Mahashivratri | కోసం ఇంద్రకీలాద్రిలో విస్తృత ఏర్పాట్లు..

Mahashivratri | కోసం ఇంద్రకీలాద్రిలో విస్తృత ఏర్పాట్లు..
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలి..
- దుర్గాగుడి ఈవో సీనా నాయక్
Mahashivratri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, సూపర్డెంటెంట్లు, పండుగ విభాగం, సమాచార సాంకేతిక విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమీక్షల భాగంగా ఈవో శీనా నాయక అధికారులతో మాట్లాడుతూ కొండపైకి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రిఫ్యాబ్రికేటెడ్ ఫ్రేములతో పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రద్దీ సమయాల్లో భక్తులను మల్లికార్జున మహామండపం మీదుగా మళ్లించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నదీ స్నానాలు చేసే భక్తుల కోసం దుర్గా ఘాట్‌తో పాటు ఇతర స్నానపు ఘాట్ల వద్ద పారిశుద్ధ్యం, భద్రత మరియు కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు.

ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్ సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని తెలిపారు. ఆలయ పరిసరాలు, ఘాట్ల వద్ద నిరంతరం శుభ్రత కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలయ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఆన్‌లైన్ లావాదేవీలను మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు. దర్శన టికెట్లు, ప్రసాదాల కొనుగోలు తదితర సేవల కోసం ఆన్‌లైన్ టికెటింగ్‌ను ప్రోత్సహించాలని, డిజిటల్ చెల్లింపుల ద్వారా కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గేలా సమాచార సాంకేతిక విభాగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో భక్తులకు మజ్జిగ, పాలు, తాగునీరు పంపిణీ చేయాలని, అవసరమైన చోట నీడ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, రాత్రి వేళల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మహాశివరాత్రి నాడు భక్తులు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, భద్రత, సౌకర్యాలు, పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ఈవో సీనా నాయక్ స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు.
