నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం జన్మన్) క్రింద గిరిజన గూడాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పిఎం జన్మన్, ధర్తి ఆబా జంజాటియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వెంకటశివప్రసాద్, హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పిఎం జన్మన్ కింద మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. గ్రౌండింగ్‌లో ఉన్న 281 ఇళ్లు, ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి మార్చి 31వ తేదీ నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు.
కపిలేశ్వరం నుండి జనాలగూడెం వరకు 7.1 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని నాణ్యతతో డిసెంబరు నాటికి పూర్తి చేసేలా ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. వెలుగోడు, కొట్టాలచెరువు, భైర్లుటి గూడెల్లో కేటాయించిన వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
త్రాగునీటి కనెక్షన్లు అవసరమైన చోట ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను, అలాగే సెల్ టవర్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ సూచించారు.
ధర్తి ఆబా జంజాటియా గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద గులాంఅలియాబాద్ తాండా, రాళ్లకొత్తూరు గ్రామాలకు 116 ఇళ్లు కేటాయించబడ్డాయని తెలిపారు. వాటి నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా 7 సీసీ రోడ్లు, వాటర్ సప్లై, విద్యుత్ కనెక్షన్లు వంటి మౌలిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డులకు సంబంధించి జిల్లాలో ఇంకా 1,779 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని 15 రోజుల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పిఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గిరిజన గూడాల్లోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు.
భైర్లుటి గూడెం, గులాంఅలియాబాద్ తాండాల్లో ఏర్పాటు చేసిన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. జ్యూట్ బ్యాగులు, ప్రసాద కప్పులు, నన్నారి తయారీ వంటి చిన్నతరహా కార్యకలాపాల్లో పాల్గొనే గిరిజన మహిళలకు అవసరమైన చేయూత అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

