- యార్లగడ్డ కృషితో కోల్ ఇండియా రూ.2.36 కోట్లు నిధులు మంజూరు
గన్నవరం, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు సేవలు అందించే గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరించడంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ చేసిన కృషి ఫలించింది. గన్నవరం ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయన నిర్ణయించారు.
ఎమ్మెల్యే పదవి చేపట్టిన వెంటనే ఆసుపత్రి అభివృద్ధికి నిధుల కోసం వైద్య–ఆరోగ్య శాఖను సంప్రదించగా, నిధుల కొరత కారణంగా ప్రతిపాదనలు పంపితే ప్రాధాన్యతా క్రమంలో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అధికారుల ప్రక్రియ వల్ల ఆలస్యం జరుగుతుందని భావించిన యార్లగడ్డ, వివిధ కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు జరిపి సిఎస్ఆర్ నిధులను తెచ్చేందుకు కృషి చేశారు.
ఈ ప్రయత్నాలు ఫలించి, కోల్ ఇండియా చైర్మన్ పోలవరపు ప్రసాద్‌ను కలిసి వైద్యశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని కోరారు. యార్లగడ్డ విజ్ఞప్తికి స్పందించిన ప్రసాద్, పదవీవిరమణకు రెండు రోజుల ముందు రూ.2.25 కోట్లు గన్నవరం సామాజిక వైద్యశాల అభివృద్ధికి మంజూరు చేశారు.
ఈ నిధులతో గన్నవరం సామాజిక వైద్యశాలలో కొత్తగా నాలుగు ఓపి రూములు నిర్మాణానికి రూ.60 లక్షలు, రక్త నిల్వ గది రూ.15 లక్షలు, ఆఫీసు రూమ్ రూ. 12 లక్షలు, ఎమర్జెన్సీ రూమ్ రూ.15 లక్షలు, బయో మెడికల్ వేస్ట్ రూమ్ రూ.10 లక్షలు, పోస్టుమార్టం గది రూ. 6 లక్షలు, ఎన్‌బిఎస్‌యు రూ.12 లక్షలు, సిపాప్ ఫర్ న్యూ బోర్న్ రూ.2.91 లక్షలు, ప్లంబింగ్ పనులకు రూ. 5లక్షలు, రూ.7 లక్షల ఖర్చుతో విద్యుదీకరణ పనులుతోపాటు అధునాతన డెంటల్ చైర్ రూ.3 లక్షలు, అల్ట్రాసౌండ్ మిషన్, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్, డ్యూటీ డాక్టర్స్, ఫిజియోథెరపీ, లేబర్ తదితర గదుల నిర్మాణం, వైద్యచికిత్సలకు అవసరమైన అదునాతన వైద్య పరికరాల ఏర్పాటుకు ఈ రూ. 2.25 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. చైర్మన్ ప్రసాద్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసినందుకు యార్లగడ్డ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా, గత ప్రభుత్వ హయాంలో హెచ్‌సిఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులు మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాలకు కేటాయించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యార్లగడ్డ ఆ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి గన్నవరం ఆసుపత్రికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తికి స్పందించిన హెచ్‌సిఎల్ సంస్థ రూ.17.25 లక్షలు కేటాయించింది.
ఈ నిధులతో రూ. 1.36 లక్షలతో థైరాయిడ్ పరీక్ష యంత్రం, రూ. 6.46 లక్షలతో జనరేటర్, రూ. 2.51లక్షల ఖర్చుతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసారు.
అదనంగా, శిధిలావస్థలో ఉన్న ఆసుపత్రి ప్రహరీ గోడ, ఎంట్రెన్స్ గేటు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల పరిషత్, గ్రామపంచాయతీ రూ.30 లక్షలు కేటాయించగా పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎన్నో ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన గన్నవరం వైద్యశాల, ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు ఆధునాతన వసతులతో రూపుదిద్దుకుంటోంది.

