వైభవంగా మహాలక్ష్మి యాగం
కొత్త యాగశాలలో సాంప్రదాయ బద్ధంగా..
ధన త్రయోదశి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పూజలు
పాల్గొన్న చైర్మన్ బొర్రా గాంధీ ఈవో శీనా నాయక్..
(ఆంధ్రప్రభ, విజయవాడ) : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ త్రయోదశిని పురస్కరించుకుని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం శ్రీ మహాలక్ష్మి యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ధన త్రయోదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాల వద్ద ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పురోహితులు సాంప్రదాయ బద్ధంగా మహాలక్ష్మి యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
దుర్గగుడి ధర్మకర్త మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వాహణ అధికారి శీనానాయక్ కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొన్నారు. ధన త్రయోదశి రోజున భగవంతుడిని పూజించడం ద్వారా సకల సంపదలు ఆరోగ్యం దీర్ఘాయుష్షు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ నేపథ్యంలో కనకదుర్గమ్మ వారి ఆలయంలో ధన త్రయోదశి రోజు నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గమ్మకు గాజుల బహూకరణ
ఈనెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహూకరించారు. ప్రతి ఆట ఆలయంలో నిర్వహించే ఈ గాజుల మహోత్సవం అత్యంత విశిష్టతను కలిగి ఉంటుంది. దాతల సహకారంతో నిర్వహించే ఈ గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధానాలయం తో పాటు ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు.
వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆరోజు కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిగా దేవస్థానం తరపున గాజులను అధికారులు సిబ్బంది ఆదివారం అందజేశారు. మహా మండపం ఏడవ అంతస్తు నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అందజేశారు.
