హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన కేటీఆర్. మంగళవారం సోమాజీగూడలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే ఇచ్చినందుకే నిండా ముంచాడని.. కాంగ్రెస్ కు మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఇక కాంగ్రెస్ కుర్చీ మడత పెట్టే తీర్పు ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. పరిశ్రమలు తరలిపోతున్నాయని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో భవిష్యత్తు అస్తవ్యస్తమైందని, రైతులు, నిరుద్యోగులు, పేదలు, వృద్ధులు అన్నీ నిరాశలో ఉన్నారని అన్నారు. ప్రజల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే ప్రభుత్వం మనకెందుకని ప్రశ్నించారు. పేదలకు రాజ్యం కాదు, బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ వర్గాన్నీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అత్తలకు రూ.4,000, కోడళ్లకు రూ.2,500 ఇస్తామని చెప్పి మాట తప్పిందని, వృద్ధుల పెన్షన్ పెంపు, రైతు రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాల భరోసా, స్కూటీలు, తులం బంగారం వాగ్దానాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నిక ప్రజలకు ఒక కీలక నిర్ణయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కారు వర్సెస్ బుల్డోజర్ పోరు అని పేర్కొన్నారు. మీ ఇళ్లపై బుల్డోజర్ రాకుండా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేయండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు.
రోడ్ షోకు ప్రజల నుండి ఉత్సాహభరిత స్పందన లభించింది. కిలోమీటర్ల పొడవున అభిమానులు, కార్యకర్తలు బారులుతీరి నిలబడి నినాదాలతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. బైక్ ర్యాలీలు, కళారూప ప్రదర్శనలు, డిజిటల్ ప్రచారం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

