- మాదిగ ఎమ్మెల్యేల వినతి
- సానుకూలంగా స్పందించిన హై కమాండ్
ఢిల్లీ, ఆంధ్రప్రభ : మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల బృందం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాటు జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ కు విన్నవించారు. ఈరోజు (గురువారం) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు.
గత 30 సంవత్సరాలుగా మాదిగ జాతి కల అయిన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు వెలువడిన వెంటనే, శాసనసభలో తీర్మానం చేసి, దేశంలో ఏ ఇతర రాష్ట్రం ఇంకా అమలు చేయని చట్టాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.33 లక్షల మాదిగ జనాభా ఉందని, ప్రస్తుతానికి ఈ సంఖ్య సుమారు 50 లక్షలకు పెరిగిన నేపథ్యంలో, రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగ జాతికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. నిజమైన కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాన్ని ఖర్గే, వేణుగోపాల్ శ్రద్ధగా విని, సానుకూలంగా స్పందించారని, మాదిగ వర్గానికి తగిన న్యాయం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మందుల సామెల్, కాలే యాదయ్య లు పాల్గొన్నారు.