ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కీలకమైన మ్యాచ్ లో బ్యాటర్లు రాణించడంతో.. లక్నోను 6 వికెట్ల తేడాతో ఓడించి గెలిచిన బెంగళూరు క్వాలిఫయర్స్ కు దూసుకెళ్లింది. 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
ఆర్సీబీ విజృంభణ
కాగా, ఈ కీలక మ్యాచ్‌లో 228 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన ఆర్సీబీ.. ఓపెనర్లు కీలక మంచి ఆరంభం ఇచ్చారు. ఫిలిప్ సాల్ట్ (19 బంతుల్లో 30) రాణించగా.. విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 54) అర్ధశతకంతో చెలరేగాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 34 బంతుల్లో 61 పరుగులు జోడించి బలమైన పునాదులు వేశారు.

ఆ తరువాత రజత్ పటీదర్ (7 బంతుల్లో 14) ఔటవ్వగా.. ఆ వెంటనే లియామ్ లివింగ్‌స్టోన్ (0) డకౌట్ గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జితేష్ శర్మ మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న జితేష్.. జట్టును నిలబెట్టాడు. కేవలం 33 బంతుల్లో 85 పరుగులు చేసిన జితేష్, లక్నో బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు.
అతనితోడు మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41నాటౌట్) సెలక్లివ్ షాట్లతో బౌండరీలు కొట్టి ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి 45 బంతుల్లో 5వ వికెట్‌కు 107 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్కే రెండు వికెట్లు తీయగా.. ఆకాష్ సింగ్, అవేష్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోర్నమెంట్ 18 ఏళ్ల చరిత్రలో ఒకే సీజన్‌లో తమకు కేటాయించిన ఏడు అవే (ప్రత్యర్థి హోం గ్రౌండ్) మ్యాచ్‌లను గెలిచిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది.
ఈ విజయంతో క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ – పంజాబ్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరోవైపు గుజరాత్ – ముంబై జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.