ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇటీవల సినిమా టికెట్ల (Movie tickets) రేట్లు చూస్తే గుండె గుబిల్లుమనిపిస్తుంది. మరీ కొత్తగా విడుదలయ్యే పెద్ద సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంత పెద్ద మొత్తం పెట్టి టికెట్ కొనడం సామాన్యులకు చాలా భారంగా ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) జీఎస్టీలో కీలక సంస్కరణలకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబ్‌లను, రెండు శ్లాబ్‌లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబ్‌లను, రెండు శ్లాబ్‌లకు కేంద్రం తగ్గించింది. ఇప్పటివరకు ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులు ఇకపై ఉండవని ప్రకటించింది. 5,18 శాతం శ్లాబులే ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో సినీ వర్గాల్లోనూ మూవీ టికెట్ రేట్లపై ఆసక్తి నెలకొంది.
ధరలు ఇలా మారే అవకాశం ఉంది..
ప్రస్తుతం రూ.100 దాటిన సినిమా టికెట్‌పై 18శాతం జీఎస్టీ (GST) పడుతోంది. వందలోపు మూవీ టికెట్ పై 12 శాతం జీఎస్టీ ఉంది. అయితే కొత్త జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సినిమా టికెట్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్‌పై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా, దాన్ని 5శాతానికి తగ్గించింది. రూ.100కు పైగా ఉన్న 18శాతం జీఎస్టీలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. రూ.100 కన్నా తక్కువ ఉన్న టికెట్‌పై ప్రస్తుతం ఉన్న 12శాతం జీఎస్టీని 5శాతానికి కుదించేందుకు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం రూ.112 ఉన్న టికెట్ త్వరలో రూ.105కే ప్రేక్షకుడికి లభించనుంది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్‌లకు వెళ్లే రూరల్ ప్రేక్షకులకు ఉపశమనం కలగనుంది. ఈ క్రమంలో వారు సినిమా హాళ్లకు క్యూ కట్టే అవకాశం ఉంది.
మల్లీప్లెక్స్‌ల్లో నో చేంజ్
ప్రేక్షకులకు అందుబాటులో ధరలో సినిమా టికెట్ల ధరలు ఉండేలా చూడడం, థియేటర్ యజమానులకు అండగా నిలవడం కోసం ఇటీవల మల్టీప్లెక్స్ (Multiplex) అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300లోపు ఉన్న సినిమా టికెట్లను 5శాతం పన్ను శ్లాబ్ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అయితే మల్లీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు మొండి చెయ్యి ఎదురైంది. కేవలం సింగిల్ స్క్రీన్లలో రూ.100లోపు టికెట్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5శాతానికి కుదిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో మల్లీప్లెక్స్ సినిమా టికెట్ల ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కాగా ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది.