LOVE | ఆగిపోతున్న ప్రేమికుల ఊపరి!

LOVE | ఆగిపోతున్న ప్రేమికుల ఊపరి!
- విద్యావంతులు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు…
- పరువు పోతుందని ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు…
LOVE | వెబ్ డెస్క్ (తెలంగాణ-క్రైమ్), ఆంధ్రప్రభ : ప్రేమ రెండు మనస్సులకు సంబంధించింది.. మరీ పెళ్లి..? రెండు కుటుంబాలకు సంబంధించింది! మన సామాజిక వ్యవస్థలో కులం అతి కీలక పాత్ర పోషిస్తున్నది. సామాజిక వ్యవస్థలో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ అంతే! ఇదే జాడ్యం పల్లె నుంచి పట్టణం వరకూ పరుగులు పెడుతోంది. కొన్ని సామాజిక వర్గాల పెత్తనం ఇంకా తగ్గలేదు. అందుకే కులం ముందు ప్రేమ ఓడిపోవడమే కాదు.. ప్రేమికుల (Lovers) ఊపిరి ఆగిపోవడానికి కూడా కారణమవుతుంది! ఇక్కడ నిరక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు అనే తేడా కూడా కనిపించడం లేదు! ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. సామాజిక వర్గాల మధ్య కూడా సామరస్యం పెరుగుతుంది. అయినా కుల అహంకారం మాత్రం పూర్తిగా, అన్నిచోట్లా తగ్గలేదు. ఇటీవల ప్రేమికుల ఊపిరి ఆగిపోవడానికి ఇదే కారణం!

LOVE | పెళ్లి నిరాకరణకు కులమే కారణమట!
ప్రేమించానని నమ్మించాడు.. పెళ్లికి నిరాకరించాడు.. నిరాకరణకు కులమే కారణమన్నాడు.. దీన్ని తట్టుకోలేని ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణమైన సీనియర్ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం జల్లాపూర్ దళిత కుటుంబానికి చెందిన లావణ్య సిద్దిపేట ప్రభుత్వ (Govt) వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. అదే కళాశాలలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న సికింద్రాబాద్ ఆల్వాల్ కు చెందిన ప్రణయ్ తేజ్‌తో గత ఏడాది జూలైలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. లావణ్య తక్కువ కులానికి చెందిన యువతి కావడంతో తేజ్ వివాహానికి నిరాకరించాడు. దీంతో లావణ్య మనస్తాపానికి గురై గడ్డి నివారణకు వాడే పారాక్విట్ మందును సెలైన్ ఎక్కించే సూది ద్వారా ఇంజక్షన్ చేసుకోవడంతో అపస్మారక స్థితిలో పడిపోయింది.

ఈ విషయాన్ని గుర్తించిన రూం మేట్స్ ఆమెను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి (Hospital) తరలించారు. కాగా ఆమె చికిత్స పొందుతూ ఆదివారం నిమ్స్‌లో మరణించింది. మృతురాలు అక్క శిరీష ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన నిందితుడు ప్రణయ్ తేజను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు.
LOVE | కూతురును చంపినట్లు పోలీసులు గుర్తించిన వైనం…
ఇక మరోచోట…తమ కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తామే చంపేశారు. అయితే కడుపు నొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించారు. పోలీసులు కాస్తా లోతుల్లోకి వెళ్లడంతో అది ఆత్మహత్య కాదు, హత్యగా తేలింది. హుజూరాబాద్ ఏసీపీ (Acp) మాధవి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శివరామ్ పల్లి గ్రామానికి చెందిన బాలిక గత ఏడాది నవంబర్ 14న చనిపోయింది. కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది పరువు హత్యగా తేల్చారు.
శివరాంపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పలుమార్లు కూతురిని మందలించారు. కుటుంబ గౌరవం పోతుందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ బాధితురాలి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆపై ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశారు. అనంతరం ఏమీ తెలియనట్టుగా తన కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులే దోషులని తేల్చి వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

LOVE | ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటా అన్నందుకు…
తమ కుమార్తెను ప్రేమించాడనే కారణం, ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని అన్నందుకు బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయిని (Sravansai) దారుణంగా హత్య చేశారు. ఓ పథకం ప్రకారం బాధితుడిని ఇంటికి రప్పించి.. బ్యాటుతో దారుణంగా కొట్టి ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదీ కూడా గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది. బీరంగూడలో ఈ దారుణం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
హత్యకు గురైన శ్రవణ్ సాయి.. మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో (College) బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా అతడి స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ. హత్యకు గురైన శ్రవణ్, నిందితురాలి కుమార్తె టెన్త్ నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్, తన కుమార్తెల ప్రేమ గురించి నిందితురాలికి ఎప్పుడో తెలుసని.. వద్దని వారించినా వారిలో మార్పు రాలేదని తెలుస్తోంది. నిందితురాలి కుమార్తె ఇప్పుడు గర్భవతి అని.. శ్రవణ్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో… పథకం ప్రకారం అతడిని ఇంటికి రప్పించి.. దారుణంగా కొట్టి హత్య చేశారని తెలుస్తోంది

