లండన్ భారత విదేశాంగ మంత్రి లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయన పర్యటనకు అంతరాయం కలిగించేలా ఖలిస్థానీ అతివాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఓ దుండగుడు ఏకంగా జైశంకర్ కారు వద్దకు అత్యంత సమీపంగా దూసుకొచ్చాడు.లండన్ లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన వ్యక్తంచేశారు. ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమికొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
భారత్‌పై సుంకాల మోత.. ట్రంప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఈ నెల 4న యూకే పర్యటనకు వెళ్లిన జైశంకర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఇందులోభాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్యపరమైన చర్చలు, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా ‘ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర’ అనే అంశంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.