Lokesh | తిమ్మాపురం ఆలయానికి రూ.56.25 లక్షలు మంజూరు

Lokesh | తిమ్మాపురం ఆలయానికి రూ.56.25 లక్షలు మంజూరు
- మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపిన తిమ్మాపురం గ్రామస్తులు, నాయకులు…
Lokesh | చిలకలూరిపేట (ఆంధ్రప్రభ) : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాచీన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం రూపురేఖలు మారనున్నాయి. గ్రామస్తులు గతంలో మంత్రి లోకేష్ దృష్టికి ఆలయ అభివృద్ధి అంశం తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో తిమ్మాపురంలోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ముఖమండపం, ఆలయ అభివృద్ధి పనులు కోసం దేవాదాయ శాఖ మొత్తం అంచనా వ్యయం 62 లక్షల 50 వేల రూపాయలు కాగా, మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ 6,25,000, సిజిఎఫ్ నుంచి 56 లక్షల 25వేల రూపాయలు మంజూరు చేయడమైనది.
దేవాలయం అభివృద్ధి కోసం అడిగిన వెంటనే దేవదాయ, ధర్మదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయించడం పట్ల గ్రామస్తులు మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఆలోచనలను గౌరవిస్తూ, దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమని, ఈ నిధులతో దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరిచి, భక్తులకు, గ్రామ ప్రజలకు అవసరమైన మరింత సౌకర్యాలు కల్పించే అవకాశం కలుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తున్నమంత్రి నారా లోకేష్‌కు రుణపడి ఉంటామన్నారు.
