- వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికుల మృత్యువాత
- ఊహించని ఘటనల్లో అమాయకులు బలి
- ప్రమాద బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం
- అతివేగం, అజాగ్రత్తే ప్రమాదాలకు కారణం!
- ఓవర్ లోడ్, స్పీడ్.. ప్రమాదాలకు కారణమని తేల్చేస్తున్నఅధికారులు
- మరి ఓవర్ లోడ్, వేగనియంత్రణ ఎవరి బాధ్యత?
- నిమ్మకు నీరెత్తినట్టు అధికారుల వ్యవహారం
- సంబంధిత అధికారులనూ బాధ్యులుగా పరిగణించాలని బాధిత కుటుంబాల డిమాండ్
(సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ)
ఊహించని రోడ్డు ప్రమాదాలతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. ఆయా ప్రమాదాల్లో తమ ఆప్తులను కోల్పోయిన సందర్భాలు అనేకం. కొన్ని సంఘటనల్లో తీవ్ర గాయాలకు గురవుతున్న సందర్భాలూ అనేకం. అనుకోని ప్రమాదాల్లో తమ కుటుంబీకులను పోగొట్టుకున్న తరుణంలో ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్న ఘటనలు అనేకం. ఇందుకు కారణం ఒకవైపు భారీ వాహనాల ఓవర్ లోడు, అతివేగమేనని, మరోవైపు గుంతల మయమైన రోడ్లూ కారణమవుతున్నాయని, ఇంకో వైపు నిర్లక్ష్య డ్రైవింగే ప్రమాదాలకు కారణమని అధికారులు తేల్చేస్తున్నారు. మరి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు తమకు సంబంధమే లేదన్నట్టు చేతులెత్తేయడం ఎంటని బాధిత కుటుంబాలు బగ్గుమంటున్నాయి. నిర్లక్ష్యపు సమాధానాలు మాని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్నప్రమాదాలతో వాహనదారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వికారాబాద్ జిల్లా చేవెళ్ల పరిధిలోని మిర్జాగూడ-ఖానాపూర్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ ఘోర ప్రమాద ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో పలు రోడ్డు ప్రమాద సంఘనల్లో అమాయకులు మృత్యువాత పడుతుండటం జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురచిచేస్తున్నది. ఇందుకు కారణం ఏమిటి? ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్టు, ఓవర్ లోడ్డు అనే మాట ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తుకు వస్తుందా? అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులతోపాటు ఆర్ అండ్ బీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులూ బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టినప్పుడే ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు
- ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
నారాయణఖేడ్‌కు మండలం జగన్నాథ్ పూర్ చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 5న కర్ణాటకలో దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. బీదర్ జిల్లా హల్లిఖేడ్ సమీపంలో కారు, బొలెరోవ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా గణగాపూర్‌లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆయా కుటుంబాలతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొల్పింది. మృతుల్లో డ్రైవర్ నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) చెందినవారుగా గుర్తించిన విషయం తెలిసిందే మృతులంగా ఒకే కుటుంబ సభ్యులు, బంధువులు కావడంతో వారి స్వగ్రామంలో అంతులేని విషాదం నెలకొంది.
స్కూటీని ఢీకొట్టిన లారీ.. కొడుకు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు…
అతివేగంగా వెళుతున్న ఓ లారీ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో కొడుకు మృతిచెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిట్కుల్ గ్రామానికి చెందిన భానూరి కృష్ణయ్య తన కొడుకు భానూరి సురేష్ ఈ నెల 6న స్కూటీపై తన తండ్రిని ఎక్కించుకొని పోచారం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి ఇంద్రేశం వైపు వెళ్తుండగా గ్రామ శివారుకు రాగానే టీజీ 07వీ5128 రెడ్ మిక్స్ లారీ అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొనడంతో సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలిస్తుండగా పటాన్ చెరు బస్ స్టాప్ వద్ద మృతిచెందాడు.

బోల్తా కొట్టిన రెడీమిక్స్ లారీ…
కాగా ఈ నెల 7న పటాన్ చెరు పాతటోల్ గేట్ వద్ద కాంక్రీట్ లోడుతో వెళుతున్న. టీఎస్ 08యూజీ 9259 నంబర్ గల రెడీమిక్స్ లారీ ఒక్కసారిగా బోల్తాపడింది. డ్రైవర్, క్లీనర్లు ఇద్దరూ స్వల్పగాయాలతో బయటపడగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో పటాన్ చెరునుంచి టోల్‌గేట్ వరకు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు.

రోడ్డు డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు…
పటాన్చెరువు మండలం ముత్తంగి వద్ద 65వ జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు డివైడర్ ఎక్కడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వస్తుండగా ముత్తంగి వద్ద డివైడర్ పైకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పటాన్చెరు
పోలీసులు అక్కడికి చేరుకొని బస్సును డివైడర్ నుంచి పక్కకు తొలగించారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బైక్‌పై తన కొడుకుతో వెళుతున్నఓ మహిళను బారీ ట్యాంకర్ వేగంగా దూసుకువచ్చి ఢీకొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదాలు జరగడం ఖాయమని తెలుస్తోంది.

