కర్నూలు: జిల్లాలోని కందనాతిలో ఈరోజు (గురువారం) పిడుగుపాటుకు గురై ఒక బాలుడు మృతి చెందాడు. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో.. రవి (15) అనే బాలుడు పొలం పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బాలుడు రవి చెట్టు కిందికి చేరుకునేలోపే పిడుగు పడింది.
రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలవ్వగా… వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలు…
జిల్లాలోని సి.బెళగల్ మండలంలో గురువారం భారీ వర్షాలకు పిడుగుపాటుకు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో అకస్మాత్తుగా భారీ వర్షం పడటంతో, దాదాపు 50 మంది వాహనదారులు ఇనగండ్ల క్రాస్ రోడ్‌లోని బస్ స్టాండ్‌లో తలదాచుకున్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో బస్ స్టాండ్‌లో అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో బస్ స్టాండ్‌లో ఉన్న ఐదుగురు పిడుగుపాటు కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన ఐదుగురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటలకు తరలించారు. ఇనగండ్ల క్రాస్ రోడ్డులోని బస్టాండ్.. పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతింది.