వరద నీటిలో మంత్రి, కలెక్టర్..

వరద నీటిలో మంత్రి, కలెక్టర్..
నంద్యాల బ్యూరో అక్టోబర్ 29 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal district) లో తుఫాన్ ప్రభావంతో ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైంది. గ్రామీణ, పట్టణ లోతట్టు ప్రాంతాల్లో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల వర్షాలతో నీటమునిగిన ప్రాంతాలను రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం పరిశీలించారు. వాతావరణం తెప్పరిల్లటంతో ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారు. జిల్లాలో ఒక్కరోజు 2694.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లాలో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా కొత్తపల్లి మండలం శివపురం లింగాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అన్ని గ్రామాలలో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో (SC Colony and BC Colony) నీరు నిల్వ ఉండిపోయాయి. ఈ పరిస్థితి ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కుందునది ఉప్పొంగి ప్రవహించటంతో నంద్యాల నుంచి గడివేములకు వెళ్లే రహదారిలోని పలు గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంతెనలు బ్రిడ్జిలు వద్ద పోలీసులు కాపలా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వారికి పునరావస్తు కేంద్రంలో వసతి సౌకర్యాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ బండి శేషన్నలు సమకూర్చారు. జిల్లాలోని పలు గ్రామాలలో మంత్రి, కలెక్టర్ పర్యటించి ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. అలాగే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరద నీటిలోనూ దిగి మంత్రి, కలెక్టర్ బాధితులను పరమార్శించటం విశేషం. కలెక్టర్ వెంట మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కొప్పుల శివ నాగిరెడ్డి, ఆర్డీవో విశ్వనాధ్, తాసిల్దార్, తదితర అధికారులు ఉన్నారు.
