పాటల్లోనే జీవం.. ఎమోషన్.. !!

  • మన జీవన గమనమే గీతం…
  • గుండెలను హత్తుకునేలా.. మనసును దోచేలా పాటలు..
  • నేటితరం పాటల్లో పూర్తి వైరుధ్యం….
  • విజయవాడలో మొదటిసారి ప్రోగ్రాం..
  • ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా….

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : మనం పాడే పాటల్లోనే జీవం, ఎమోషన్లు ఉంటాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. మన జీవన గమనమే ఒక గీతమని, గుండెలను హత్తుకునేలా, మనసును దోచేలా పాటలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

కానీ నేటి తరం పాటల్లో పూర్తిగా వైరుధ్యం కనిపిస్తుందని ఆయన అన్నారు. కాలం మారుతున్నప్పటికీ మూలాలను మర్చిపోకూడదన్నారు.

విజయవాడలో అట్టహాసంగా నిర్వహించిన‌ ఇళయరాజా సంగీత విభావరి కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా విలేకరులతో మాట్లాడుతూ.. త‌న జీవితంలో జరిగినవి అన్నీ పాటలే. మాట్లాడటానికి ఎం లేదు అని అన్నారు.

త‌న‌ పాటలు విని విని ఇంతమంది వస్తున్నారు. ఆ పాటల్లో జీవం, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. త‌న‌ పాటలు గుండెల్లోకి, మనస్సుల్లోకి వెళ్తున్నాయి. ప్రతి జీవితంలో త‌న‌ పాటలు భాగమయ్యాయి అని తెలిపారు.

ఇప్పుడు వస్తున్న పాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. మెల్ సింగర్ పాడింది ఫీమేల్‌కి తెలియదు, ఫీమేల్ పాడింది మెల్‌కి తెలియదు. డైరెక్టర్‌కే ఏ పాట వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.

త‌న‌ కాలంలో 80 మంది ఆర్కెస్ట్రా ఒకేచోట ఉండి పాటలు కంపోజ్ చేసేవాళ్ళమ‌ని…. రికార్డ్ టైంలో పాడేవాళ్ళమ‌న్నారు. స్టూడియోలో ఎవరు ఏ పాట పాడాలో తానే రాసి ఇస్తానని తెలిపారు. రిహార్సల్‌ చేసి చేసి కరెక్ట్‌గా వచ్చిందని అనిపించినప్పుడే బయటకు విడుదల చేసేవాళ్ళమ‌ని తెలిపారు. 60 మంది ఒకే విధంగా కృషి చేస్తే 4 నిమిషాల పాట పూర్తయ్యేదని… ఇప్పుడు మ్యూజిక్ చేసే వాళ్ళు ఒకే లైన్‌లో ఉండడం లేదు అని తెలిపారు.

కొన్ని సందర్భాల్లో శ్రుతులు తప్పుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మొదటిసారి ఈ ప్రోగ్రాం జరగుతుంద‌ని.. ఇక్కడ ప్రోగ్రాం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని ఇళయరాజా అన్నారు.

Leave a Reply