జనాన్ని కాపాడుదాం : మంత్రి గొట్టిపాటి

జనాన్ని కాపాడుదాం : మంత్రి గొట్టిపాటి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati RaviKumar) సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మొగల్తూరు మండలాల్లోని తీర ప్రాంతాలలో తుఫాను ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సోమవారం ఆయన పరిశీలించారు.

మొంథా తుఫాన్ (mantha cyclone) తో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రాణ నష్టం లేకుండా చూడటంతో పాటు, ఆస్తి నష్టం తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. వైద్య, వ్యవసాయ శాఖ సిబ్బందిని క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటించాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, పంట నిల్వలపై రైతులకు అవగాహన కల్పించాలి, రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు సూచించాలని కోరారు.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పిఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply