భవాని విరమణలను విజయవంతం చేద్దాం…

  • పూర్తి కార్యాచరణతో పనులు ప్రారంభం..
  • దుర్గగుడి ఈవో సేన నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ..

విజయవాడ, ఆంధ్రప్రభ : దీక్ష విరమణల మహోత్సవాన్ని సమన్వయంతో విజయవంతం చేద్దామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు.

ఆదివారం మహామంటపం నాలుగో అంతస్తులోని ఈవో ఛాంబర్లో కార్తీక మాసం, భవానీ దీక్షల కార్యాచరణ కోసం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవంలో వైదిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల భద్రత రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందితో చర్చించారు. భక్తుల భద్రతపై ప్రభుత్వం తాజాగా జారీ చేసిన సూచనల అమలుపై వైదిక కమిటీ సభ్యులతో మాట్లాడారు.

దీపోత్సవం దేవస్థానం ఆధ్వర్యంలోనే..

కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే దీపోత్సవం పూర్తి స్థాయిలో దేవస్థానం ఆధ్వర్యంలో జరగాలని నిర్ణయించారు. దేవస్థానం వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి దేవాలయ సాంప్రదాయం ప్రకారం వైదిక క్రతువులు నిర్వహించనున్నారు.

ఇటీవలి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపోత్సవం దేవాలయ అంతర్గత కార్యక్రమంగా నిర్వహిస్తామని, పౌర్ణమి సాయంత్రం దీపాలు అర్చకులు వెలిగిస్తారని, భక్తుల భద్రత కారణంగా భక్తులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండదని తెలిపారు.

ఏ ఏ ప్రదేశాల్లో దీపాలు ఏర్పాటు చేయాలి, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లపై నగర పోలీస్‌ అధికారులు తగు సూచనలు చేశారు. డిసెంబర్‌ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు, భవాని దీక్షల విరమణ కార్యక్రమాలపై కూడా చర్చించారు.

భవాని దీక్షల కరపత్రం, వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

భవాని దీక్షలు–2025కు సంబంధించిన కరపత్రం, వాల్‌ పోస్టర్‌ను ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ తదితరులు ఆవిష్కరించారు. దీక్ష విరమణ మహోత్సవానికి సంబంధించి గురు భవానీలతో పాటు భవానీలందరికీ అవగాహన కల్పించే విధంగా రూపొందించిన ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో పోలీస్‌ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply