TG | సైబర్ భద్రతలో తెలంగాణ‌ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతాం – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భః తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ భద్రతలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు కేవలం వ్యక్తిగత, ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను సురక్షిత బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో ఇవాళ‌ జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డితో క‌ల‌సి రేవంత్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో మారుతున్న నేరాల రూపానికి అనుగుణంగా పరిపాలనా విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం కోరారు.

ఒకప్పుడు దోపిడీ చేయాలంటే దొంగలు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చేద‌ని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింద‌ని అన్నారు సిఎం. ఒక్క క్లిక్ తోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలువునా దోచేస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు ఇప్పటికే సైబర్ భద్రతను మెరుగు పర్చడంలో అగ్రభాగాన ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే, ఇప్పటివరకు చేసినవి సరిపోవు.. ఇంకా చాలా చేసేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మారుస్తామ‌ని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *