కొండపల్లి, ఎటపాక పై ప్రత్యేక దృష్టి పెడదాం



( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి): కొండపల్లి, ఎటపాక కళలను కాపాడుదాం, అందుకు అవసరమైన చర్యలు తీసుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. స్వచ్ఛ భారత్ , సర్క్యులర్ ఎకానమీ” పై జరిగిన చర్చలో , రాష్ట్ర పర్యావరణ, అటవీ , శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రాంతిలాల్ దండే(Krantilal Dande), రాష్ట్ర పరిశ్రమలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్(Yuvraj) మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు అడిగారు.

ఈ సందర్భంగా ఏలూరు కలెక్టర్ సెల్వీ, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పలు అంశాలను సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) దృష్టికి తీసుకువచ్చారు. కొండపల్లి బొమ్మలకు తెల్ల కొయ్య లభించటం లేదని, అటవీశాఖ ఆధీనంలో ఈ చెట్లు ఉండటంతో .. వాటి నుంచి తెల్ల కొయ్యను సేకరించటం కుదరటం లేదని , ఇక్కడి కొండపల్లి బొమ్మల తయారీ కుటుంబాలకు ఉపాధి ఉండటం లేదని ఆయన వివరించారు. ఇక ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వీ మాట్లాడుతూ, ఎటపాకలోనూ ఇదే స్థితి నెలకొందన్నారు.

తెల్ల కొయ్యను సేకరించటానికి చెట్లను ప్రైవేటుగా పెంచితే మంచిదని సూచించారు. ఇక కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ(Collector DK Balaji) మాట్లాడుతూ, అర్బన్ ప్రాంతాల్లో చెత్తను సేకరించటానికి కంపాక్ట్ లను వినియోగిస్తున్నారని, ఇదే రీతిలో గ్రామీణ ప్రాంతాలకు కాంపాక్టులను మంజూరు చేయాలని కోరారు. రెండు అంశాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. కొండపల్లి, ఎటపాక బొమ్మల కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో కేంద్రం ఇచ్చే నిధులతో పని చేయాలని, అదే విధంగా మిగిలిన పనులకు ఆర్థిక సాయం తమ ప్రభుత్వం అందిస్తున్నారు.

రాష్ట్ర పర్యావరణ, అటవీ , శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రాంతిలాల్ దండే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 30.05 శాతం గ్రీన్ కవర్ ఉన్నదని, 2029 నాటికి 37 శాతం , 2034 నాటికి 42శాతం, 2039 నాటికి 47శాతం, 2047 నాటికి 50 శాతం సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికల( plans)ను రూపొందించి అమలు చేస్తున్నటట్టు తెలిపారు. ఈ క్రమంలో అటవీ పునరుద్ధరణ, ట్రీ ప్లాంటేషన్లు,మడ అడవులు, తీర ప్రాంత రక్షణ, అగ్రోఫారెస్ట్రీ, అర్బన్ మియావాకి గ్రీనింగ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్టు వివరించారు. MGNREGS, CSR, NGOs, TTD తదితర సంస్థల సహకారంతో విస్తృతంగా మొక్కల నాటుతున్నట్టు తెలిపారు. ఎకోటూరిజంలో భాగంగా నగర వనాలు, సఫారీలు, ట్రెక్కింగ్ మార్గాలు, నైట్ స్టే సదుపాయాలు కల్పిస్తున్నట్టు కాంతిలాల్ తెలిపారు.

స్వచ్ఛ భారత్ , సర్క్యులర్ ఎకానమీ పై జరిగిన చర్చలో రాష్ట్ర పరిశ్రమలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఆంధ్ర – సర్క్యులర్ ఎకానమీ అమలు పథకానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. సర్కులర్ ఎకానమీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 11 సెక్టార్లను గుర్తించగా రాష్ట్ర ప్రభుత్వం ఒక రంగాన్ని అదనంగా గుర్తించిందని తెలిపారు.ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రత , పర్యావరణ పరిరక్షణలో ఒక మోడల్‌గా నిలపాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో, ప్రతి నెలా ఒక థీమ్ ఆధారిత కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక నెలలో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్, మరో నెలలో వేస్ట్ టు వెల్త్, ఇంకో నెలలో హరిత ఆంధ్ర వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.

ఈ విధంగా ప్రతి నెలకు ఒక ప్రత్యేక దిశా నిర్దేశం ఉంటుందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనదని , ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో స్వచ్ఛత కమిటీల ఆధ్వర్యంలో పరిశుభ్రత పనులు జరిగి, వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్, లిక్విడ్ , సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రూపొందించామని, దాని ఆధారంగా అక్టోబర్ 2 నుండి జిల్లాలకు ర్యాంకింగ్ ఇస్తామన్నారు. మంచి పనితీరును కనబరచిన జిల్లాలను ప్రోత్సహించి , వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక మార్గదర్శకాలు అందజేస్తామన్నారు. ఈ ప్రణాళికలో CSR (Corporate Social Responsibility), NGOs, SHGs (Self Help Groups) వంటి సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వ -ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నట్లు ఆయన తెలిపారు.ఈసర్కులర్ ఎకానమీ విషయంలో మెరుగ్గా పనిచేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందని కార్యదర్శి యువరాజ్ పేర్కొన్నారు.

Leave a Reply