• అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ‌దామా..?


క‌రీంన‌గ‌ర్ : దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్రంగా స్పందించారు. ‘‘అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి వెంటనే దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టండి. ఆ దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషన్ (Election Commission) కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో వెళ్లండి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?’’ అంటూ బండి సంజ‌య్‌ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల 25 వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లంటూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు.

ఏం మాట్లాడుతున్నారో అర్థ‌మ‌వుతుందా..?


పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) ఏం మాట్లాడుతున్నారో అర్థ‌మ‌వుతుందా? అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. ఒక్కసారైనా వార్డు మెంబర్ గానో, ప్రజాప్రతినిధిగానో గెలిచి ఉంటే ఓట్ల చోరీ సంగతి తెలిసేదని, ఆయన ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి అని అన్నారు. ఓట్ల చొరీ సంగతి ఆయనకేం తెలుసు? అని ప్ర‌శ్నించారు. కరీంనగర్ లో ఒక ఓటు వేసి జగిత్యాలలో మరో ఓటు చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం సాధ్యమైతదా? ఆయన ఎట్లా మాట్లాడతారు? అని మండిప‌డ్డారు. దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే మొత్తం ఎంపీ స్థానాలను గెలుచుకునే వాళ్లం కదా? కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? అని అన్నారు.

20 నెల‌ల పాల‌న‌లో పంచాయ‌తీ పైసా ఇవ్వ‌ని కాంగ్రెస్‌…


గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఒక్క పైసా అయినా ఇచ్చిందా? త‌న‌కు తెలిసినంత వరకు 20 నెలల పాలనలో పంచాయతీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని పార్టీ కాంగ్రెస్ అని బండి అన్నారు. పంచాయతీ ఎన్నికలు సైతం కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారే తప్ప ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే కాంగ్రెస్ కు లేద‌న్నారు.

హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు బీజేపీ కొట్లాడ‌తాది…


మతం పేరు చెప్పి ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ నాయకులని మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ అంటుంటే నవ్వొస్తుందని, ఎన్నికలున్నా లేకున్నా హిందూ సమాజం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ బీజేపీ (BJP) కొట్లాడతాద‌ని బండి అన్నారు. బైంసాలో పేద హిందువుల ఇండ్ల‌ను తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెసోళ్లు ఎటు పోయారు? గోహత్యలు జరుగుతుంటే ఎటుపోయారు? చివరకు గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలంటే రోడ్డుకు అడ్డం ఉందని, సౌండ్ పెట్టొద్దని, ర్యాలీలు చేయొద్దంటూ రకరకాల షరతులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నార‌ని మండిప‌డ్డారు.

రోహింగ్యాల‌ను పంప‌డానికి స‌హ‌క‌రించ‌ని కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌..


రోహింగ్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నార‌ని, రోహింగ్యాలు 2014కు ముందు ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చారని బండి అన్నారు. అప్పుడు అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్సే అని అన్నారు. లా అండ్ ఆర్డర్ (Law and order) రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటోంద‌ని, రోహింగ్యాలను పంపాలని చెబుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సహకరించలేదని అన్నారు. పైగా ఓటు బ్యాంకు కోసం ఓటర్ కార్డులిచ్చి, రేషన్ కార్డులిచ్చి, ఇండ్లు ఇచ్చి వాళ్లను పెంచి పోషిస్తున్నార‌ని చెప్పారు.

Leave a Reply