Legislature | ప్రశ్నోత్తరాల సమయం అర్థం కావాలి…

Legislature | ప్రశ్నోత్తరాల సమయం అర్థం కావాలి…
- తెలుగు భాషా గౌరవాన్ని కాపాడాలి…
- రాజధానిలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి…
Legislature | గన్నవరం – ఆంధ్రప్రభ : శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు ఇచ్చే సమాధానాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. మంత్రులు “అవును, కాదు, ఉత్పన్నం కాదు” అని చెప్పే సమాధానాలు సభలో ఉన్న వారికి అర్థమైనప్పటికీ, టీవీల్లో చూసే ప్రేక్షకులకు ప్రశ్న ఏమిటో తెలియక అయోమయం నెలకొంటోందని, దీనిపై స్పీకర్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే జీరో అవర్ లో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన స్పందన లేదా రిప్లైలు రావడం లేదని, దీనివల్ల తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై స్పష్టత కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలో మహనీయుల గుర్తింపు ఇచ్చేలా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ వ్యక్తులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, విశ్వనాథ సత్యనారాయణ వంటి సుమారు 30 నుండి 40 మంది ప్రముఖులను గుర్తించి, రాజధానిలోని పార్కులు లేదా ఇతర ప్రాంతాల వద్ద వారి విగ్రహాలను ప్రతిష్టించాలని విన్నవించారు. ఎన్.టి. రామారావు , పింగళి వెంకయ్య లకు భారతరత్న పురస్కారం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. అలానే తెలుగు భాషా పరిరక్షణ, సభా మర్యాదలపై కాపాడాలని… శాసనసభలో సభ్యులను అకారణంగా దూషించడం, బూతులు తిట్టడం వంటి చర్యలను అరికట్టడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలుగు భాషను కాపాడటంలో భాగంగా గతంలో ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయం అయినప్పటికీ, ఇటువంటి దూషణలు భాషా గౌరవాన్ని తగ్గిస్తున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. సభ కేవలం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని యార్లగడ్డ స్పష్టం చేశారు.
