తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేతల పర్యటన
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి వైసీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరావు పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావ ప్రాంతాల్లో పాటు మున్నేరు వరద నీటి కారణంగా ఆయకట్టులో ఉన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలాలలోని గుమ్మడి రుద్ర అనిగండ్లపాడు పెనుగంచిప్రోలు గ్రామాల్లో శనివారం పర్యటించిన నాయకులు అక్కడ వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. తువ్వా కాలువ మైసమ్మ గుడి వద్ద గండిపడడంతో సుమారు 2500 ఎకరాల పంట వరద నీటిలో ఉండడాన్ని పరిశీలించి పొలాల్లోకి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించే వరకు వైసీపీ రైతుల తరఫున అండగా ఉంటూ పోరాటం చేస్తుందన్నారు.

