ఖమ్మం రూరల్: పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంజిల్లా కలెక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వనజీవి రామయ్య అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. చివరిసారిగా వనజీవి భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి వనజీవి రామయ్య అంత్యక్రియలువీడ్కోలు పలికారు.
ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చేసి, రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం రామయ్య సతీమణి జానకమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. వనజీవి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, రామయ్య కోరికలు నెరవేర్చుతామని భరోసానిచ్చారు. అనంతరం.. రామయ్య పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశాన వాటిక వరకు అధికారులు తరలించారు.
ఈ సందర్భంగా కడసారి రామయ్యను చూసేందుకు ఖమ్మం జిల్లావాసులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి అనేకమంది సామాజికవేత్తలు తరలివచ్చారు. రామయ్య పాడెను కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రూరల్ తహశీల్దార్ ఈ రాంప్రసాద్, మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మోశారు. అనంతరం రెడ్డిపల్లి స్మశాన వాటికలో రామయ్య అంతక్రియలు నిర్వహించారు.