బిందు సేద్యంలో ‘ఆటోమేషన్’ రైతులకు వరం

బిందు సేద్యంలో ‘ఆటోమేషన్’ రైతులకు వరం

మైక్రో ఇరిగేషన్ ఆటోమేషన్‌పై సబ్సిడీ
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : బిందు సేద్యంలో ఆటోమేషన్ సాంకేతికతను వినియోగించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందగలరని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆధునిక సాగు ఆటోమేషన్ పథకం’ పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద జిల్లాలోని రైతులకు సాగునీటి నిర్వహణను సులభతరం చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు, ఎరువులు అందించడం వల్ల పంట ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు 55 శాతం రాయితీ, ఇతర రైతులకు 45 శాతం రాయితీ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులందరూ ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు లేదా ఉద్యానవన శాఖ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నమోదు సమయంలో భూమి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, ఏపీఎమ్ఐపి పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply