Kurnool | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం…. అవగాహన ర్యాలీ

Kurnool | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం…. అవగాహన ర్యాలీ

జీవనశైలి మార్పులతో క్యాన్సర్‌కు అడ్డుకట్ట : జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్.

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ శరీరంలోని అన్ని భాగాలకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. శరీరంలోని కణజాలం తన స్వభావాన్ని మార్చుకుని అదుపు లేకుండా విస్తరించడం వల్ల క్యాన్సర్ ఏర్పడుతుందని చెప్పారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జీవనశైలి అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.

మద్యపానం, ఆహార పదార్థాల్లో రసాయన రంగుల వినియోగం, అధిక బరువు, కాలుష్యం, వ్యాయామం లేని జీవన విధానం, జన్యుపర లోపాలు, ఆహార పదార్థాల్లో పెస్టిసైడ్ల అవశేషాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వంటి కారణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోవడం, ప్లాస్టిక్ మరియు డిస్పోజబుల్ వస్తువుల అధిక వినియోగం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు 12 సంవత్సరాల పైబడిన బాలికలు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. క్యాన్సర్‌పై సమగ్ర అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సామాజిక ఆరోగ్య అధికారులు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటికీ వెళ్లి 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వారా, నోటి క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రికి ఓపీ నెంబర్ 222 ద్వారా రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. క్యాన్సర్‌పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు, గణాంకాధికారి హేమసుందరం, అసంక్రమిత వ్యాధుల విభాగ సిబ్బంది, మాస్ మీడియా సెక్షన్ సిబ్బంది, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply