Kurnool | న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

Kurnool | న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు డిమాండ్

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు డిమాండ్ చేశారు. గత సంవత్సరం మార్చిలో బ్యాంకు యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసి, ప్రతి శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన తెలిపారు. సమ్మెలో భాగంగా కర్నూలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సమీపంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి అంజిబాబు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేసుకున్న ఒప్పందాలను అమలు చేయించుకోవడం కోసం సమ్మెలకు దిగాల్సిన దురదృష్టకర పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు. ఐదు రోజుల పని విధానం అమలు చేస్తే ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి ఉద్యోగ సంఘాలు అంగీకరించినప్పటికీ, యాజమాన్యం ఒప్పందాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన విమర్శించారు. రోజుకు 40 నిమిషాల అదనపు పని అనేది ప్రాక్టికల్‌గా గంటకు మించిన భారమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని అంజిబాబు ఆరోపించారు. సమ్మె చేసే హక్కును కూడా హరించే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు అమలులో ఉన్న చట్టాల ప్రకారం 14 రోజుల ముందుగా నోటీసు ఇచ్చి సమ్మె నిర్వహించే అవకాశం ఉండేదని, కానీ కొత్త చట్టాల ప్రకారం ఒకసారి అధికారులు చర్చలు జరిపితే సమ్మెకు అవకాశం లేకుండా మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. సమ్మె చేస్తే చట్టవిరుద్ధంగా పరిగణించి కేసులు నమోదు చేయడం, ఎనిమిది రోజుల జీతం కట్ చేయడం వంటి చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బడా కార్పొరేటు కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వాలు చట్టాలను మారుస్తున్నాయని విమర్శించిన ఆయన, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

బ్యాంకు ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఆత్మహత్యలు రైతులకే పరిమితమయ్యేవని, నేడు బ్యాంకు, ఐటీ రంగ ఉద్యోగులు కూడా ఆ పరిస్థితికి నెట్టబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం పని ఒత్తిడి, పని–వ్యక్తిగత జీవన సమతుల్యత లేకపోవడమేనన్నారు. బ్యాంకు ఉద్యోగుల భౌతిక, మానసిక ఆరోగ్యాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు, జీఐసీ, ఎల్ఐసీ, ఐటీ రంగాలలో వారంలో ఐదు రోజుల పని విధానం అమలులో ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో అమలు కాకపోవడం సమంజసం కాదన్నారు. బ్యాంకింగ్ రంగంలో కూడా ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని అంజిబాబు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్. రాధాకృష్ణ, జీఐసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రఘుబాబు, ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునియా కుమార్, ఎల్ఐసీ యూనియన్ నాయకులు రమేష్, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి రామరాజు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి హనుమంత్ రెడ్డి, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్, న్యూ సిటీ అధ్యక్షులు నాగేష్, న్యూ సిటీ కమిటీ కార్యదర్శి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొని బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

Leave a Reply