కుప్పం, జులై 3(ఆంధ్రప్రభ ): వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం (Kuppam) లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు (గురువారం) కుప్పం పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న తల్లికి వందనం ఇచ్చామని తెలిపారు. ఈ క్రమంలో మామిడి రైతుల కష్టాల పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమీక్షించారు. దిగుబడి పెరిగింది, డిమాండ్ తగ్గిపోయింది. అందుకే రేటు కూడా తగ్గింది. రైతులకు ఏం చేయాలో చేస్తాం, కేంద్ర సాయం కూడా తీసుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే.. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నీతిమాలిన వాళ్ళు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారు. కారు కింద కార్యకర్త పడ్డ మానవత్వం చూపించలేదు. కుక్క పిల్ల మాదిరిగా సింగయ్య (Singaya) ను పక్కన పడేశారు. సింగయ్య కుటుంబసభ్యులను బెదిరించారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. రైతులకు వాళ్లు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. కనీసం డ్రిప్ సామాగ్రి (Drip supplies) అయినా ఇచ్చారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. వాటాలు వసూలు చేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.