KTR | ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్

KTR | ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్
- బాకీ ఉన్న రూ.1560 కోట్లను తక్షణమే చెల్లించాలి..
- ఆటో కార్మికుల సంక్షేమం కోసం పోరాటం తప్పదు..
- బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమానికి హాజరై ఆటో డ్రైవర్లకు (Auto Drivers) ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు పెండింగ్ లో ఉన్న రూ.1560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే హైదరాబాద్ లో మహాధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆటో అన్నలతో బిఆర్ఎస్ కు ఉన్న అనుబంధం కొత్తది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో, ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారని, తెలంగాణ కావాలే, అయ్యి తీరాలని ర్యాలీలు (Rally) తీసి కేసీఆర్ కు మద్దతుగా నిలబడ్డారని గుర్తుచేశారు. వారి పాత్ర పోరాటంలో మరువలేనిదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పట్ల తన ప్రేమను చాటుకున్నారని కేటీఆర్ తెలిపారు. కేవలం ఆటో అన్నలకే కాకుండా, రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది ఆటో కార్మికులకు, అడగకుండానే, మ్యానిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగమాటలు చెప్పకుండానే 5 లక్షల ప్రమాద బీమాను కల్పించారని వివరించారు.

కేసీఆర్ (KCR) రైతు బీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని, అలాగే డ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు, కార్మిక పక్షపాతి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు అసంఘటిత రంగంలోని దాదాపు 13న్నర లక్షల మంది డ్రైవర్లకు కూడా రూ.5లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. సిరిసిల్ల జిల్లా కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమని, నేతన్నలు, కర్షకులు, ధార్మికులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటారని వివరించారు.
