పోలీస్ సిబ్బందికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశం
మంగినపూడి బీచ్‌ను సందర్శించిన కలెక్టర్ డీకే బాలాజీ
(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి): మొంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో మంగినపూడి బీచ్ సందర్శకులను అనుమతించొద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బీచ్ పర్యవేక్షణలోని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. మంగినపూడి బీచ్ ను ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ సందర్శించి అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ఆయన సముద్ర తీరాన్ని సందర్శించి అలలు తాకిడిని పరిశీలించారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. భద్రత సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మచిలీపట్నం ఆర్డీవో కే స్వాతి, మత్స్య శాఖ జిల్లా అధికారి అయ్యా నాగరాజా, రెవెన్యూ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

