Koduru | మాఘ పౌర్ణమి సన్నాహకాలు చేసేదేన్నడో…?

Koduru | మాఘ పౌర్ణమి సన్నాహకాలు చేసేదేన్నడో…?
- శిథిలావస్థకు చేరిన భక్తుల సౌకర్యార్థం నిర్మించిన భవనం
Koduru | కోడూరు, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు సంగమ ప్రదేశంలో స్నానం ఆచరించేందుకు కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి రానున్నారు. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టకపోవటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏడాది ఆర్టీవో స్థాయి అధికారులతో వారం రోజులు ముందే సమావేశం నిర్వహించి యాత్రికులకు సౌకర్యాలు సిద్ధం పరిచేవారు.

గత కొన్ని సంవత్సరాలుగా భక్తులను పవిత్ర సంగమం వద్దకు వెళ్లకుండా అధికారులు భద్రత పేరుతో ఆంక్షలు విధించి అడ్డుకుంటున్నారు. సంగమ ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరటం, సంగమ ప్రదేశానికి వెళ్లే మార్గం కూడా సరిగ్గా లేదని తెలిసినప్పటికీ, సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా అధికారులు పవిత్ర సంగమానికి భక్తులను దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి భక్తుల కోసం సంగమ ప్రదేశం వద్ద ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
