- పోలీస్ శాఖలో తీవ్ర విషాదం
హుజూరాబాద్ (ఆంధ్రప్రభ): సీనియర్ పోలీస్ అధికారి డీఎస్పీ మహేష్ గుండెపోటుతో శుక్రవారం ఉదయం హఠాన్మరణం చెందారు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
శుక్రవారం ఉదయం విధులకు హుజూరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించినా, డాక్టర్లు సీపీఆర్ చేసి ఒక గంటకు పైగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మహేష్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మహేష్ 1995 బ్యాచ్‌కు చెందినవారు. ఆయన భార్య మాధవి హుజూరాబాద్ ఏసీపీగా పనిచేస్తున్నారు. మహేష్ ఆకస్మిక మరణ వార్తతో హుజూరాబాద్ తో పాటు కరీంనగర్ ప్రాంతాల్లో పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. డీఎస్పీ మహేష్ కుటుంబానికి, ఏసీపీ మాధవికి పోలీసులు, సహచరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


