- కోల్‌కతాపై సూపర్ విక్టరీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాయల్ విక్టరీ నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో కేకేఆర్ తో తలపడిన ఆర్సీబీ.. పూర్తి డామినేటింగ్ పర్ఫామెన్స్ తో ఘన విజయం సాధించింది. 16.2 ఓవర్లలో మ్యాచ్ ముగించిన బెంగళూరు జట్టు.. కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్… బెంగళూరు ముందు 175 పరుగుల టార్గెల్ సెట్ చేసింది. ఈ పరుగుల ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. ఆర్సీబీ కొత్త ఓపెనింగ్ జోడీ ఫిలిప్ సాల్ట్ – విరాట్ కోహ్లీ 9 ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 95 పరుగులు జోడించారు.
ఫిలిప్ సాల్ట్ (56) ధనాధన్ ఫిఫ్టీతో అదరగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ పడిక్కల్ 10 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రజత్ పటీదర్ (34) వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఇక ఆఖర్లో లియామ్ లివింగ్‌స్టోన్ ( 2 ఫోర్లు, 1 సిక్స్ 5 బంతుల్లో 15 నాటౌట్) విన్నింగ్ షాట్ తో మెప్పించాడు. ఈ మ్యాచ్ లో ఆఖరి వరకు క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లీ (59 నాటౌట్) మరోసారి ఆకట్టుకున్నాడు.