BJP | భారత్​కి‘షాన్‌’! – జాతీయ ర‌థ‌సార‌థిగా కిషన్​రెడ్డి?

త్వరలోనే బీజేపీ జాతీయ‌ పగ్గాలు?!
దక్షిణాది రాష్ట్రాల‌పై అగ్రనేతల‌ ఫోకస్
ఏపీ, తెలంగాణ, తమిళనాడుపైనే దృష్టి
సామరస్యం.. సమన్వయమే కిష‌న్‌రెడ్డి అర్హతలు
సామాన్య కార్య‌క‌ర్త స్థాయి నుంచి ఉన్న‌త ప‌ద‌విలోకి
ఎన్నో కీల‌క బాధ్య‌త‌లు అధిరోహించిన సౌమ్యూడు
సంతోషం వ్య‌క్తం చేస్తున్న రాష్ట్రపార్టీ నేత‌లు

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసిన ఎమర్జెన్సీ వేళ.. ఓ నూనూగు మీసాల తెలంగాణ బిడ్డ రాజకీయ చైతన్యంతో జనతా పార్టీ జెండాను భుజాన ఎత్తుకున్నాడు. అంతులేని దేశభక్తి నినాదంతో ఆవర్భవించిన బీజేపీలో సామాన్య కార్తకర్తగా చేరి.. తన శక్తిని నిరూపించుకున్నాడు. తొలుత శాసనసభ్యుడిగా గళాన్ని వినిపించాడు. ఇప్పుడు జాతీయ స్థాయి నేతగా ఎదిగాడు. త్వరలోనే బీజేపీ రథసారథిగా పగ్గాలు అందుకోనున్నాడు. ఆయనే ప్రస్తుత కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి.. మన కిషన్​రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరించబోతోంది. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా బీజేపీ అవతరిస్తుంటే.. దక్షిణాదిపై అధిష్టానం దృష్టి సారించింది. ఇక.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యాన్ని కుంగదీసే వ్యూహంతో అధినాయకత్వం ఫోకస్ పెంచింది. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవటానికి.. అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు దక్కించుకుని తన సత్తాచాటుకుంది. కాగా, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను ఎగరేసుకుపోయింది. క్రమంగా తెలంగాణలో బలం బలగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాను కట్టబెట్టాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

అతడు అతడే..

ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన కిషన్ రెడ్డి.. రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. కీలక నేతగా ఉన్న బండి సంజయ్ దూకుడు.. కరుడుగట్టిన హిందూత్వవాది అయిన రాజాసింగ్ వంటి విభిన్నవాదులను సమన్వయం చేసుకుంటూనే.. ఏకత్వ మార్గంలో పార్టీని నడిపారనే భావన బీజేపీ అగ్రనాయకత్వంలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మరింత బలం పెరగాలంటే.. జాతీయ అధ్యక్షుడి హోదా తెలంగాణ నేతకే కల్పిస్తే మంచిదని హై కమాండ్​ అభిప్రాయపడుతోంది.

సౌమ్యుడు, విధేయుడు..

కిషన్ రెడ్డిలో పార్టీ విధేయతకు ఎలాంటి మచ్చ లేదు. పార్టీ కోసమే పని చేస్తాడు. ఏపీ, తెలంగాణకు చిరపరిచితుడు కావటం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీలో చేరిన రెండేళ్లకే 1982లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. 2001వరకు యువమోర్చ నాయకుడిగా తన శక్తిని నిరూపించుకున్నారు. 2‌‌‌‌001లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి కిషన్ రెడ్డి ప్రస్థానం దూసుకుపోయింది. 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. 2004 నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా.. అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నో కీల‌క బాధ్య‌త‌లు, ఉన్న‌త ప‌దవులు..

2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానంలో కిషన్​రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అపజయం ఎరగలేదు. 2018లో అంబర్ పేట్ అసెంబ్లీ స్థానంలో కేవలం 1,016 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశంపై ఓడిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానంలో విజయం సాధించారు. 2024లోనూ గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో తెలంగాణ తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 జులై 4న మ‌రోసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి.. బీజేపీ బలం పుంజుకునే రీతిలో వ్యవహరించారు. అందుకే ఈ సారి జాతీయ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దక్షిణాదిపై పట్టుకోసమేనా?

తెలంగాణ అంటే బీజేపీకి మక్కువ ఎక్కువే. ఎమర్జెన్సీ రాజకీయ పునాదితో బంగారు లక్షణ్ కూడా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా.. బీజేపీ నేతగా ఎదిగారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో పని చేశారు. బీజేపీ అధికారంలోకి రావటానికి ఆ రోజుల్లో బంగారు లక్ష్మణ్ నాయకత్వమే కారణం. ఆయన రైల్వే మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ ఒప్పందంలో తెహల్కా స్ట్రింగ్​ ఆపరేషన్​లో దొరికిపోయారు. కానీ, బంగారు లక్ష్మణ్​పై బీజేపీలో వ్యతిరేకత లేదు. ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలోనే కాదు.. ఆంధ్రాలోనూ బలం పెంచుకునేందుకు కిషన్ రెడ్డిని రంగంలోకి దించుతోందని పొలిటికల్ ఎనలిస్టుల అంచనా వేస్తున్నారు. ఏదీ ఏమైనా.. కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. ఏపీ, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? తమిళనాడులోనూ పార్టీ బలం పుంజుకుంటుందా? కేరళలో పార్టీ స్థితి మారుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ జాతీయ అధ్యక్ష పదవే సమాధానం ఇస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా కోసం తపిస్తున్న బీజేపీ సౌమ్యూడిగా పేరున్న కిషన్​రెడ్డికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చూస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, ఈ విష‌యంలో రాష్ట్ర పార్టీ నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *