Kinjarapu Atchannaidu | ఆరోపణలు వ‌ద్దు.. ఆధారాలతో రండి

Kinjarapu Atchannaidu | ఆరోపణలు వ‌ద్దు.. ఆధారాలతో రండి

Kinjarapu Atchannaidu | ఎన్ని రోజులైనా రెడీ
సభా గౌరవం కాపాడాలి…
అడ్డంకులు వద్దు
తిరుమ‌ల ల‌డ్డూపై చర్చకు కూటమి సిద్ధం
వైసీపీ స‌భ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం

Kinjarapu Atchannaidu | ఆంధ్రప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి : ఏపీ శాసన మండలిలో ఇటీవలి పరిణామాలపై వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తీవ్రంగా స్పందించారు. శాసన మండలి చైర్మన్ పదవిపై కూట‌మి స‌భ్యుల‌కు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే, సభ నిర్వహణకు అంతరాయం కలిగించే వైసీపీ స‌భ్యుల‌ చర్యలను ఖండించారు. కల్తీ నెయ్యి మరియు తిరుమల లడ్డూ అంశాలపై చర్చ విషయంలో మండలిలో గందరగోళం నెలకొనడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవడం బాధాకరమని అన్నారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. సభలో మేము లేనివి మాట్లాడలేదు, ఉన్న విషయాలనే ప్రస్తావిస్తున్నాం.

ప్రతిపక్ష సభ్యులు నోటీసు ఇవ్వకపోయినా, బీఏసీలో (BAC) ఒప్పుకున్న అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. తిరుమల లడ్డూ అంశంపై మార్చి 4, 5, 6, 7 తేదీల్లో ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి తెలిపారు. చర్చ జరిగితే నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు అంతరాయం కలిగిస్తోందని మంత్రి విమర్శించారు. ఏదైనా అంశాన్ని లేవనెత్తి చర్చకు ముందుకు రాకపోవడం ప్రతిపక్ష స‌భ్యుల అసమర్థతకు నిదర్శనమని అన్నారు. సభను సజావుగా నడవనీయకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. కూటమి సభ్యులందరూ చర్చకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు ఫలించవని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

Leave a Reply