ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ (Tollywood’s)మన్మథుడు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున. ఒకప్పుడు అమ్మాయిలకు ఈయన గ్రీకువీరుడు. ఎందరికో డ్రీమ్ బాయ్. అక్కినేని నాగేశ్వర్‌రావు (Akkineni Nageshwar Rao) వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ఉంచి వివిధ వెరైటీ పాత్రలు పోషిస్తూ సినీ అభిమానులను అలరిస్తున్నారు. మొదటి నుంచి ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, భక్తి చిత్రాల్లో ఈయన చేసిన పాత్రలను ఎవరూ మరిచిపోలేరు. ముఖ్యంగా శివ, నిన్నేపెళ్లాడుతా, అన్నమయ్య, ఊపిరి (Shiva, Ninepelladuta, Annamayya, Opiri) తదితర చిత్రాల్లో నాగార్జున చేసిన పాత్రలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. హీరోగానే కాకుండా ఈయన అటు అన్నపూర్ణ స్టూడియోస్, రియలెస్టేట్ వ్యాపారాలను చూసుకోవడమే కాకుండా, నిర్మాతగా, నటుడిగా కూడా తన బాధ్యతలను నిర్వహిస్తుంటాడు. అయితే ఇటీవల కింగ్ నాగార్జున పంథా మార్చారు. మూస ధోరణి చిత్రాలు చేయకుండా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తూ ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచుతున్నారు. కుబేరలో నెగిటివ్ పాత్ర, కూలీలో విలన్ పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాల ద్వారా నాగార్జున ఎలాంటి పాత్రనైనా చేయగలడని మరోసారి నిరూపించారు.
సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్..
కింగ్ నాగార్జున (King Nagarjuna)..టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికిన పేరిది. కొత్త తరహా సినిమాలు చేయడంలోనూ, కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. ‘ఊపిరి’ కొత్త ప్రయాణం ప్రారంభించిన కింగ్ నాగ్ దాన్ని మధ్యలోనే ఆపేసి మళ్లీ సోలో హీరో సినిమాలు చేశారు. రామ్ గోపాల్ వర్మను నమ్మి చేసిన ‘ఆఫీసర్’ అట్టర్ ఫ్లాప్ కావడంతో హీరోగా నాగార్జున డౌన్ ఫాల్ మొదలైంది. మళ్లీ నిలబడ్డానికి కల్యాణ్ కృష్ణ చేసిన ‘బంగార్రాజు’ను నమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కింగ్ పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. ప్రవీణ్ సత్తారుతో చేసిన ‘ది ఘోస్ట్’, డ్యాన్స్ మాస్టర్ విజయ్ బెన్నీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేసిన మలయాళ రీమేక్ మూవీ ‘నా సామిరంగ’ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మళ్లీ ట్రాక్ మార్చిన నాగార్జున కథను మలుపు తిప్పే కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలు పెట్టారు.
రూటు మర్చాడు…
ఆ తర్వాత నాగార్జున రూట్ మార్చారు. శేఖర్ కమ్ముల దర్శకుడిగా, ధనుష్ హీరోగా చేసిన కుబేర సినిమాలో నాగార్జున నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి సూపర్బ్ అనిపించారు. ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు కూలీలో నాగార్జున విలన్ పాత్ర పోషించారు. ఈ పాత్రలో నాగార్జున విశ్వరూపం చూపించారు. స్టైలిష్ విలన్‌గా నాగార్జున తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
నెక్ట్స్ 100వ సినిమా ప్లాన్..
ఆ తరువాత నాగార్జున తన 100వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి తమిళ దర్శకుడు పా. కార్తిక్ దర్శకత్వం వహించనున్నాడని, దీనికి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ని కూడా పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ విషయం పక్కన పెడితే కింగ్ తన 100వ సినిమా తరువాత మళ్లీ కొత్తదారిలోనే వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తారా? లేక సోలో హీరో సినిమాలకే ప్రాధాన్యత నిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.