- బాలికపై లైంగికదాడి కేసులో తీర్పు
నల్గొండ: ఓ బాలికపై లైంగికదాడి చేసిన మహ్మద్ ఖయ్యూమ్ (31) అనే వ్యక్తి జీవితాంతం జైలులో ఉండే విధంగా నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి తీర్పు ఇచ్చారు. నిందితుడికి 51 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసు స్టేషన్ పరిధిలో 2021లో ఓ బాలికపై మహ్మద్ ఖయ్యూమ్ లైంగికదాడికి ఒడిగట్టాడు. అప్పట్లో తిప్పర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా.. తాజాగా తీర్పు వెల్లడైంది.
శిక్ష కాలం నిర్ణయించిందిలా…
లైంగికదాడి చేసినందుకు 20 ఏళ్లు, పోక్సో చట్టం వర్తించినందుకు 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసీ కేసులో పదేళ్లు ఇలా 50 ఏళ్లు శిక్షను ఇన్‌చార్జి జడ్జి రోజారమణి తీర్పు చెప్పారు. సెక్షన్ 506 కింద మైనర్ ను బెదిరింపులు కేసులో ఏడాది శిక్ష విధించారు. మొత్తం 51 ఏళ్లు శిక్ష ఖరారు చేశారు. అలాగే 85,000/- జరిమానా విధించారు. బాధితురాలికి రూ.ఏడు లక్షల పరిహారం అందించాలని జడ్జి రోజా రమణి ఆదేశించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారని ఎస్ఐ శంకర్ తెలిపారు.
