టీవీ అప్పారావుకు కీలక పదవి

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : స్థానిక శ్రీనివాస్ నగర్‌లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా)కు గౌరవ సలహాదారుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూ విక్టరీ పాఠశాలలో నిర్వహించిన ట్రస్మా డివిజన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం డివిజన్‌లో వందకు పైగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా విద్యాసంస్థల నిర్వహణలో అపార అనుభవం కలిగిన టీవీ అప్పారావు ట్రస్మా పటిష్ట నిర్వహణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు.

పాఠశాలల కరస్పాండెంట్లను సమన్వయం చేస్తూ ట్రస్మాను రాష్ట్ర స్థాయిలో గౌరవప్రతిష్టలు పొందేలా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని తెలిపారు. గీతాంజలి విద్యానికేతన్ కరస్పాండెంట్‌గా టీవీ అప్పారావు విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతూ, పదవ తరగతి ఫలితాల్లో జిల్లాస్థాయిలో అగ్రగామిగా నిలిచేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పాఠశాల నిర్వాహకులుగా పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకుంటూ, డైరెక్టర్లు టి. పద్మ, టి. అరుణ్‌లతో కలిసి గీతాంజలి విద్యానికేతన్‌ను ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ సందర్భంగా టీవీ అప్పారావు మాట్లాడుతూ ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడు గుర్రం కాంతారావు, ట్రస్మా రాష్ట్ర నాయకులు ఐ.వి. రమణారావు, ఎండి అజారుద్దీన్, కొండపల్లి శశిధర్ రెడ్డి, ఖమ్మం డివిజన్ ట్రస్మా అధ్యక్షుడు ఎండి జాఫర్ మతిన్, కార్యదర్శి సూరిబాబు, ఖజాంచి మోహన్ రెడ్డి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ సలహాదారుగా ఎన్నికైన టీవీ అప్పారావును పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, పాఠశాలల కరస్పాండెంట్లు అభినందించారు.

Leave a Reply