తెలంగాణ (Telangana) లో ఖరీఫ్ సీజన్ మధ్యలో యూరియా కొరత తీవ్ర సంక్షోభంగా మారింది. రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడుతుండగా, సరఫరా లోపం, బ్లాక్ మార్కెట్ ఆరోపణలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన యూరియా కేటాయించింది.

తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌ వేళ యూరియా (Urea) కొరత తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. రైతులు పంటలకు కీలకమైన ఈ ఎరువు కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. సరఫరా తక్కువ కావడంతో ధరలు పెరిగి.. బ్లాక్ మార్కెట్లకు తరలివెళ్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ఆయా జిల్లాల్లో అన్నదాతలు నిరసనలతో రోడ్డెక్కుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం అసమర్థ కాంగ్రెస్ (Congress) పాలనే కారణమంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) మాటల తూటలు పేలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)తో పాటు మరో 4 రాష్ట్రాలకు గాను 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం (Government Of India) ఉత్తర్వులు జారీ చేసింది. అందులో బీహార్‌కు 2,700, ఆంధ్రప్రదేశ్‌కు 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నుల యూరియా యుద్ధప్రాతిపదికన వెళ్లనుంది. ఈ పరిణామంతో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది.

Leave a Reply