KCR | ఆ యద్ధం ఆగుతుందా!
- బీఆర్ఎస్ కు జాగృతి తంటా
- ఇరు పక్షాల్లో ఆరని సెగ
KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : గులాబీ బిగ్‌బాస్ తలచుకుంటే ఏదైనా జరుగుతుందనేది బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకం. బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రెండేళ్ల తర్వాత తెలంగాణ హక్కులను కాపాడాటానికి మరోసారి రణరంగంలోకి వస్తున్నారు. ఇందుకు సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, పార్టీ శ్రేణులు పాట పాడారు. ఈ క్రమంలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కూడా కేసీఆర్ సూచన ప్రాయంగా తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాజకీయాలు నీళ్లు.. నీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోందని విదితమే. అయితే తెలంగాణ జలదోపిడీకి గురవుతుందని బీఆర్ఎస్ అధినాయకత్వం ధ్వజమెత్తుతుంది.
తెలంగాణ హక్కులు కాపాడాటానికి మరోసారి వస్తున్న కేసీఆర్ ఆయన కుమార్తె విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న కీలకమైన నేత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు మరో ఇద్దరి నాయకులపై ధ్వజమెత్తుతున్నారు. అలాగే కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా కవితపై విమర్శలు చేశారు. దాదాపుగా వారి మధ్య ఓ చిన్న యుద్ధమే జరుగుతుంది. తండ్రి కేసీఆర్ తలచుకుంటే ఈ యుద్ధం ఆగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
KCR | కవిత రాజకీయ ప్రస్థానం…

2006లో ఆమె తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కోసం, కవిత తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 2006లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించారు. తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేశారు. 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ అధికారికంగా 2007 నవంబరులో నమోదు చేయబడింది. బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ, అన్నివర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. 2020 నుండి నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. 2014లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె వాయిస్ కూడా తెలంగాణ ప్రజల్లోకి బాగా వెళుతుంది.
KCR | ప్రస్తుత రాజకీయ పరిస్థితులు…
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ ఏ అంశాలపై యుద్ధం ప్రకటించారో.. అదే అంశాలపై కవిత కూడా యుద్ధం ప్రకటించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రయోజనాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్న గణాంకాలపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో సుమారు 25 లక్షల ఎకరాల సాగు భూమి అందుబాటులో ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 6.5 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి పారుదల సౌకర్యం కల్పించగలిగామని కుండబద్దలు కొట్టారు.
ఈ వాస్తవ పరిస్థితిని విస్మరించి, బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం సరికాదని ఘాటుగా హెచ్చరించారు. వట్టెం రిజర్వాయర్, పంప్ హౌస్‌లను పరిశీలించిన అనంతరం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది భౌగోళికంగా సుమారు 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతానికి జరగాల్సిన న్యాయం జరగలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా, కృష్ణా జలాల్లో మన వాటా అయిన 550 టీఎంసీలను దక్కించుకోవడంలో వెనుకబడిపోయామని పేర్కొన్నారు.
కనీసం అందుబాటులో ఉన్న 299 టీఎంసీల నీటిని కూడా మనం సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయామని, ఇది ఈ ప్రాంత రైతాంగానికి తీరని లోటని ఆమె అభిప్రాయపడ్డారు. నదీ జలాలు పక్కనే పారుతున్నా పొలాలకు మళ్లించలేకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్ట్‌లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కవిత మాటలు కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
KCR | కేసీఆర్ తలచుకుంటే…
బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన కవిత ప్రధానంగా హరీశ్ రావుతోపాటు మరో ఇద్దరి నేతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కవిత వాయిస్ కూడా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కవిత ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని అనడంలో సందేహం లేదు. కవిత విషయంలో కేసీఆర్ పట్టు వీడి మాట్లాడితే బాగుంటుందని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, అటు కవిత అభిమానులు భావిస్తున్నారు.

