న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ : కరీంనగర్ లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయకు మరోమారు విజ్ఝప్తి చేశారు. బుధవారం ఆయన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిశారు. అలాగే కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. శాతవాహన వర్శిటీలో ఖేలో ఇండియా కింద మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఝప్తి చేశారు. న్యూఢిల్లీలో కొద్దిసేపటి క్రితం మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్ పై మూడు అంశాలకు సంబంధించి చర్చించారు.
ఈఎస్ఐ ఆస్పత్రి అవసరాన్ని వివరించిన బండి
కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రికి బండి వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్ కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంవల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది కార్మికులు వైద్య చికిత్సకు నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ లో ఈఎస్ఐ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
రూ.పది కోట్లతో సింథటిక్ ట్రాక్
అంబేద్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. నిత్యం అంబేద్కర్ స్టేడియంకు వేలాది మంది వస్తుంటారని, వారి సౌకర్యార్థం సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేశారు. ‘‘ఖేలో ఇండియా’’ పథకం కింద కరీంనగర్ లోని శాతవాహన వర్శిటీలో రూ.16 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్ హాల్ ఏర్పాటుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారని చెప్పారు. దీనిపై స్పందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల శాతవాహన వర్శిటీని సందర్శించి మల్టీపర్పస్ హాలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదికను రూపొందించి కేంద్రానికి పంపిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.