Kandula Jahnavi | ఎందుకంటే..

Kandula Jahnavi | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : అమెరికాలో పోలీస్‌ కారు ఢీకొని మృతిచెందిన కందుల జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం దక్కింది. సియాటెల్‌ నగర యంత్రాంగం ఆమె కుటుంబానికి రూ.262 కోట్లను పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కర్నూలుకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొనడంతో చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్‌ డవే.. జాహ్నవి మృతిపై జోకులు వేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.

2023 జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతిచెందారు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి చాలా బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం లభిస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం నుంచి స్పందన రావాల్సి ఉంది.

ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాయి. జాహ్నవి సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం 2021లో అమెరికా వెళ్లారు. 2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనం వేగ పరిమితి 40 కిలోమీటర్లుగా ఉండగా, పోలీసు అధికారి 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపాడు. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి జాహ్నవి మృతిపై నాడు జోకులు వేయడం వివాదాస్పదమైంది.

Leave a Reply