బడా స్కామ్..

బడా స్కామ్..

  • వ్యాపారుల మస్కా
  • దందాలో వినుకొండ ద్వయం
  • ఐటీ అధికారులకు ఉప్పు
  • అకస్మికంగా దాడి
  • ఇల్లు, మిల్లులు, లాకర్ల తనిఖీ

ఆంధ్రప్రభ, వినుకొండ (పల్నాడు జిల్లా) : వినుకొండ అనగానే ముందుగా కందిపప్పు మిల్లులు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇక్కడ వ్యాపారులు ప్రభుత్వానికి కందిపప్పు సరఫరా చేయడం ఆనవాయితీగా వస్తుంది… అయితే ఇటీవల ప్రభుత్వం కందిపప్పు సప్లై పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టెండర్లను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే……

తాజాగా కేంద్ర ప్రభుత్వం స్కీం భారత్ డాల్ కింద వినుకొండ కు చెందిన ఇరువురు వ్యాపారులు కోట్లలో టోకరావేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు గత రెండు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

రెండు రోజుల నుంచి ఐటి అధికారులు సంబంధిత వ్యాపారుల నివాస గృహాలు, డాల్ మిల్లులు, బ్యాంకు లాకర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో ఉన్న ఇద్దరు వ్యాపారులు కేంద్ర ప్రభుత్వానికి పచ్చిపప్పు సప్లై చేసేందుకు టెండర్లను దక్కించుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యాపారులు సిండికేట్ గా మారి ఈ అవినీతికి పాల్పడినట్లు అధికారులు భావించి తనిఖీలు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు వినుకొండ పట్టణానికి చెందిన వ్యాపారులు ఉన్నట్లుగా భావించిన అధికారులు వారి బ్యాంకు లాకర్లను సైతం పరిశీలించి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

సిండికేట్ గా మారిన వ్యాపారులు 2023, 2024 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి పచ్చిపప్పు సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్నారు. ప్రభుత్వం నుంచి సెనగలు కొనుగోలు చేసి వాటిని శుభ్రపరిచి పచ్చి పప్పుగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది.

అయితే సిండికేట్ గా మారిన వ్యాపారులు ప్రభుత్వం నుంచి సెనగలు కొనుగోలు చేసి వాటిని యధావిధిగా అధిక ధరకు అమ్ముకోవడమే కాకుండా ప్రభుత్వానికి పచ్చి పప్పు సప్లై ఇవ్వకుండా భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

వ్యాపారులు పచ్చిపప్పును కేంద్ర ప్రభుత్వానికి అందించకుండా కేవలం కాగితాల్లో మాత్రమే సప్లై చేసినట్లు చూపించి వందల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. ఈ అవినీతిలో సంబంధిత అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఐటి అధికారులు భావిస్తున్నారు.

అయితే ఇటీవల సిండికేట్ గా మారిన వ్యాపారులు హైదరాబాదులో పెద్ద మొత్తంలో ఓ గోల్డ్ షాప్ లో బంగారం కొనుగోలు చేసిన విషయం ఐటి అధికారుల దృష్టికి రావడంతో తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఈ వ్యవహారం బయటపడిందని చెప్తున్నారు. ఒక్కొక్కరు కోట్లలో బంగారం కొనుగోలు చేసినట్లు అధికారులు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ తనిఖీలను పకడ్బందీగా చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఐటి అధికారులు బ్యాంకు లాకర్లను తనిఖీ చేయాలని బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి తనిఖీలు చేసినట్లు తెలిసింది. గతంలో వినుకొండ డాల్ వ్యాపారులపై మాత్రమే విమర్శలు, ఆరోపణలు వచ్చేవి. తాజాగా సనగల కొనుగోలు కుంభకోణం తెరపైకి రావడం, ఐటి అధికారులు గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తుండడంతో స్థానిక వ్యాపార వర్గాల్లో ఆందోళన కనిపిస్తుంది.

Leave a Reply