శ్రీ దుర్గా దేవిగా

శ్రీ దుర్గా దేవిగా
- కనకదుర్గమ్మ దర్శనం
- కొండంత జనం పీరాజనం..
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : త్రిశూలాన్ని చేత పట్టి.. స్వర్ణ కిరీటంతో సింహ వాహనాన్ని అధిష్టించి.. దుర్గాసురుడు అనే రాక్షసుడుని తన కాళ్ళ కింద తొక్కి పెట్టిన దివ్య మంగళ తేజోమయ స్వరూపమే శ్రీ దుర్గాదేవి. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు కనకదుర్గమ్మ వారు మంగళ స్వరూపుని దుష్టసంహారిని అయినా శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులను కరుణించారు. దుర్గే దుర్గతి నాసిని అనే వ్యాక్యంతో భక్తులకు సకల శుభాలు కలుగుతాయి అమ్మని దర్శిస్తే దుర్ఘతులను పోగొట్టి సద్గుతులను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ (Kanaka Durgamma) దర్శనం కోసం తరలివస్తున్న భక్తులు జై భవాని జై జై భవాని అనే నామస్మరణతో ఇంద్రగిరలు ప్రతిధ్వనిస్తుండగా అత్యంత శక్తి స్వరూపిణి శ్రీ దుర్గా దేవికి భక్తజనం నీరాజనాలు పలుకుతున్నారు. సాధారణ భక్తులతో పాటు భవానీలు సైతం పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మ దర్శనానికి రావడంతో అన్ని క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. రహదారులన్నీ అమ్మ దర్శనం కోసమే అన్నట్లుగా విశేష సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సకల సదుపాయాలను కల్పించామని అధికారులు చెబుతూ సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తున్నామంటున్నారు. మరోవైపు పలువురుకే కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో అమ్మవారికి నీరాజనం పడుతుంటే పూర్తి ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఇంద్రకీలాద్రి వేదమంత్రాలతో మారుమ్రోగుతుంది.
తండోప తండాలుగా తరలివస్తున్న భక్తులు..
శ్రీ దుర్గాదేవి (Durga Devi) అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి దేశ విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపమైన శ్రీ దుర్గా దేవి అవతారంలో ఉన్న అమ్మవారి దర్శనాన్ని ఉదయం 3 గంటల నుండి అధికారులు ఏర్పాటు చేయగా తెల్లవారుజాము నుండే భక్తులతో క్యూ లైన్ లన్నీ కిటకిటలాడాయి. జై భవాని జై జై భవాని అనే నామస్మరణ స్మరిస్తూ భక్తులు కృష్ణా నదిలో పుణ్య స్నానమాచరించి కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద ప్రారంభమవుతున్న క్యూలైన్ల ద్వారా ఘాట్ రోడ్డు నుండి అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్న అధికారులు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ వస్తున్నారు.
కుంకుమ పూజకు తరలుతున్న భక్తులు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల (Dussehra Sharanavaratri celebrations) సందర్భంగా కనకదుర్గమ్మ వారికి అత్యంత ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహా మండపం ఆరవంతస్తు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ పాదాల చెంత మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వీటితోపాటు శ్రీ చక్రార్చన, ఖడ్గమాలార్చిన, చండీ హోమం ఇలా అన్ని ఆర్జిత సేవల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
పరమ పవిత్రం అమ్మ ప్రసాదం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి ( Indrakeeladri) పై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు అమ్మవారి ప్రసాదమైన అన్న ప్రసాదంతో పాటు లడ్డూలను పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారు. జగన్మాత దర్శనం తర్వాత శివాలయం దగ్గర మెట్ల మార్గం ద్వారా దిగువకు చేరుకుంటున్న భక్తులు కొత్తగా నిర్మించిన అన్నదాన భవనంలో అమ్మవారి ప్రసాదమైన అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే భక్తుల అవసరాలు కనుగుణంగా ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ అన్నప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మూడు పూటలా అమ్మవారి ప్రసాదాన్ని నిర్విఘ్నంగా అందిస్తున్న అధికారులు భక్తులు ఎన్ని లడ్డూలు కొనుగోలు చేస్తే అన్ని అందించే ఏర్పాట్లు చేశారు. అమ్మ దర్శనానంతరం మహా మండపం దిగుణ మెట్లు మార్గం ద్వారా కిందకు వస్తున్న భక్తులు అక్కడ ఏర్పాటు చేసిన అన్నదానంతో పాటు లడ్డు కౌంటర్ల ద్వారా అమ్మ ప్రసాదాన్ని కొనుగోలు చేసి స్వీకరిస్తున్నారు.
దుర్గమ్మకు ప్రముఖులు ప్రణామం…
శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ వారిని మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారి అలంకరణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన నేపథ్యంలో మొట్టమొదటిగా ఈవో తో పాటు పలువురు అధికారులు అమ్మవారిని దర్శించుకుని భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ (Endowment Department Principal Secretary) హరి జవహర్ లాల్, విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సినీ రాజకీయ రంగ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. విఐపి లకు ప్రత్యేకంగా కేటాయించిన సమయాల్లో వీరికి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్న అధికారులు, విఐపి దర్శనాల సమయం తర్వాత వచ్చిన వారికి బంగారు వాకిలి నుండి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

