కడెం పీహెచ్‌సీని సిహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయాలి

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పీహెచ్‌సీ ఆసుపత్రిని సిహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ సోమవారం కడెం, పెద్దూర్ గ్రామాల నాయకులు, యువకులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను ప్రజావాణి కార్యక్రమంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిహెచ్ రాజేష్ కుమార్, షేక్ నయీమ్, శివరాత్రి వెంకటేష్, జి. ముత్యాలు, బైరి శ్రీనివాస్, ఆర్. పరమేష్, అల్మాస్ తదితరులు మాట్లాడుతూ, కడెం పీహెచ్‌సీలో వైద్య సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నెలకు రెండుసార్లు నిర్మల్ జిల్లా ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ స్వర్ణ రెడ్డి, అలాగే అనస్థీషియా, పీడియాట్రిక్స్ వైద్యులను డిప్యూటేషన్‌పై పంపించాలని కోరారు.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ప్రతి నెల 2వ, 4వ మంగళవారం గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, అనస్థీషియా వైద్యులు కడెం పీహెచ్‌సీలో సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. డాక్టర్ స్వర్ణ రెడ్డి మార్చి 31, ఏప్రిల్ 7, మే 12, 26 తేదీలలో కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని నాయకులు వెల్లడించారు.
