సామాజిక తెలంగాణతోనే అందరికీ న్యాయం
ఉమ్మడి నిజామాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అవకాశం, అధికారం, ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ జాగృతి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు పోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla’s Kavita) స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం, సమస్యల పరిష్కారం ముఖ్యమని, రాజకీయ పార్టీ పెట్టడం పెద్ద పని కాదని, అవసరమైతే తప్పకుండా పార్టీ పెడతానని తెలిపారు.


జనం బాటలో భాగంగా రెండో రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో ప్రజలతో, బాధితులతో కలిసి కవిత మాట్లాడారు. అటవీభూములను లాక్కోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించిన కవిత ధైర్యాన్ని ఇచ్చారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు…
ప్రస్తుతం విద్య అందరికీ అందుబాటులో లేదు. ఫీజు రీ యింబర్స్ మెంట్(Fee Reimbursement) ఇస్తలేరు. దాంతో నష్టపోయేది ఎవరు? అని ప్రశ్నించారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచి వేస్తోంది. ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాల్సిందే. అధికారంలో మహిళల వాటా 5 శాతం కూడా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదు. అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరముంది.
మైనార్టీల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ మైనార్టీ మంత్రి లేని మొట్ట మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇదే.
మైనార్టీ, ఎస్టీ మంత్రి లేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అందరికీ సమాన అవకాశాలు రావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది కావాలి. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి పెట్టింది పేరు.
-అవకాశం, అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మగౌరవం వస్తుంది. ఒక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసమే మాట్లాడటం లేదు. తెలంగాణలోని అందరి కోసం మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు(Reservations), అవకాశాలు, ఉపాధి విషయంలో సమానత్వం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. గ్రూప్ -1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇచ్చారు.
దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాను. ఆయన సుమోటోగా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాను. ఆ 8 మంది గ్రూప్ -1 స్థాయిలో ఉండి 30 ఏళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో తెలంగాణకు నష్టం జరుగుతుంది. వారందరినీ ఆపే వరకు పోరాటం చేస్తాం. యువతకు జరిగిన నష్టంపై మాట్లాడతాను.
రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, ఉద్యమకారులను కలుస్తాం. వాళ్లు పెన్షన్ కావాలి. దానికోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తారు. అమరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలన్నదే నా కోరిక. బీఆర్ఎస్(BRS) నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదు.
నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్ని. వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేశాను. నా విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అసలు నేను బయటకు రావాలని అనుకోలేదు. అనివార్య పరిస్థితుల్లోనే బయటకు వచ్చాను. వారు కాదనుకున్న తర్వాతే పార్టీకి రాజీనామా చేశా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడాల్సి ప్రతి అంశంపై మాట్లాడాను. కానీ పార్టీకి నష్టం చేసే వారిదే పై చేయి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ లో బాధ్యతను మరిచిన మోసపూరిత వ్యక్తులదే పై చేయి అయ్యింది. అలాంటివారితో బీఆర్ఎస్, కేసీఆర్ కు నష్టం జరగనుంది.
ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు తెలియని తెలంగాణ కాదు. నా బాధ ప్రజలకు చెబుతా. వాళ్ల బాధ వింటా. పరిష్కార మార్గానికి ప్రయత్నం చేస్తా.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. స్థానిక జాగృతి కార్యకర్తలు ఏ పార్టీ ఓటు వేయాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ నాతో పార్టీ పెట్టిస్తున్నారా? అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేశారు. నాతో పార్టీ పెట్టించాల్సి అవసరం కేసీఆర్ కు లేదు. నిజామాబాద్ లో నా ఓటమికి అప్పటి ఎమ్మెల్యేలే కారణమని నేను చాలాసార్లు చెప్పాను.
ఒక పార్టీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆత్మపరిశీలన, రివ్యూ అవసరం. ఐదేళ్ల క్రితమే ఎవరి పనితీరు ఏంటీ? అని తెలుసుకొని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు. కాంగ్రెస్ కు ప్రజల నుంచే దిక్కు లేదు. నాకు వాళ్లు ఏమీ సపోర్ట్ చేస్తారు? మునిగిపోయే నావ కాంగ్రెస్. వాళ్లతో నాకేం పని. నాకు చాలా మంది మద్దతు ఉన్నారు.

బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో అర్వింద్ రాజీనామా చేయాలి. అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుంది. మీరు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలి పోతారని కవిత సలహా ఇచ్చారు. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీలో ఉంది. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బిసి బిల్లు కచ్చితంగా అవుతుంది. నేను జనం బాటకు వస్తున్నానని తెలిసి మరో బీజేపీ ఎంపీ నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆయన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతాను.

