Judgement Day | అన్నా వ‌ర్శిటిలో లైంగిక‌దాడి – దోషికి 30 ఏళ్లు జైలు శిక్ష‌

చెన్నై – గతేడాది తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలన రేపిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన జ్ఞానశేఖరన్ కు శిక్ష ఖరారు చేసింది. దోషికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. శిక్షతోపాటు రూ.90,000 జరిమానా కూడా విధించారు.

కాగా, గత వారం ఈ కేసును విచారించిన చెన్నై ( లోని మహిళా కోర్టు జ్ఞానశేఖరన్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. చార్జిషీట్‌లో పేర్కొన్న మొత్తం 11 అభియోగాల్లో అతడు దోషిగా తేలాడు.ఈ కేసు విచారణ సందర్భంగా మహిళా కోర్టు జడ్జి రాజలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని అభియోగాల్లో దోషిగా తేలినందున జ్ఞానశేఖరన్‌కు కచ్చితంగా తీవ్రమైన శిక్షపడాలని అన్నారు. అయితే జ్ఞానశేఖరన్‌ మాత్రం తనకు తక్కువ శిక్ష విధించాలని కోర్టును కోరాడు. తాను వృద్ధురాలైన తన తల్లితోపాటు, ఎనిమిదేళ్ల కుమార్తె బాగోగులు చూసుకోవాల్సి ఉందని, కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని అభ్యర్థించాడు.

కేసు వివ‌రాల‌లోకి వెళితే అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో బిర్యానీ పాయింట్ నడుపుతున్న జ్ఞానశేఖరన్‌ గత ఏడాది డిసెంబర్‌లో 19 ఏళ్ల విద్యార్థినిపై క్యాంపస్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. వర్సిటీలో సెకండియర్‌ చదువుతున్న విద్యార్థినిపై గతేడాది డిసెంబర్‌ 23న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్‌ వెనుకవైపు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి వారిని వీడియో తీశాడు. బాధితురాలి స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను తన మొబైల్‌లో రికార్డు చేశాడు. విషయం బయటకుచెబితే వీడియో బయటపెడుతానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు.

అయినా బాధితురాలు భయపడకుండా తన స్నేహితుడితో కలిసి ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై విచారణ జరిపి చార్జిషీట్‌ దాఖలు చేశారు. జ్ఞానశేఖరన్‌పై మొత్తం 11 అభియోగాలు మోపారు. అన్ని అభియోగాల్లోనూ అతడిని దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది.

Leave a Reply