భూసర్వేలో కచ్చితత్వానికి ‘కోర్స్’ కేంద్రం ప్రారంభం…

భూసర్వేలో కచ్చితత్వానికి ‘కోర్స్’ కేంద్రం ప్రారంభం…
ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన సర్వేలు: జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, ఆంధ్రప్రభ : భూసర్వే రంగంలో కచ్చితత్వం, పారదర్శకత పెంచేందుకు కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (CORS) కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర అతిథి గృహం ఆవరణలో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోర్స్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోర్స్ కేంద్రాలు 24 గంటలు పనిచేసే రిఫరెన్స్ స్టేషన్లుగా శాటిలైట్లతో అనుసంధానం అవుతూ రేఖాంశాలు, అక్షాంశాలను అత్యంత కచ్చితత్వంతో కొలవడానికి సహాయపడతాయని తెలిపారు. ఈ కేంద్రాలు సుమారు 35 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తాయని పేర్కొన్నారు. సర్వేయింగ్, మ్యాపింగ్, జీఐఎస్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో రియల్ టైమ్ కైనమాటిక్ (RTK) సేవలను అందించడం ద్వారా సర్వే పనులు వేగవంతంగా, తప్పులులేకుండా నిర్వహించవచ్చని వివరించారు.
సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ భూసర్వే ప్రక్రియను సులభతరం చేస్తుందని తెలిపారు. జిల్లాలో భూసర్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా ఇది కీలక ముందడుగు అని అభిప్రాయపడ్డారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బి.సి. పరిడా మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 70 కోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సి.బెళగల్, హోలగుంద మండలాల్లో రెండు కేంద్రాలు ఉండగా, తాజాగా నగరంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ సర్వేయర్ దేవబ్రత పాలిత్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేయర్ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
