యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్

యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్

20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం
విద్య, పోలీస్ శాఖల్లో భారీ నోటిఫికేషన్లు
పారదర్శక నియామకాలపై లోకేష్ హామీ
ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు
..

సత్యనారాయణపురం, ఆంధ్రప్రభ : విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని విజన్–2047 కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యువతకు కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిందని వెల్లడించారు.


రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే 20 నెలల కాలంలో 6,28,347 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. అదనంగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. జాబ్ క్యాలెండర్‌లో విద్య, పోలీస్ శాఖలకు ప్రాధాన్యత కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని, మరోసారి డీఎస్సీతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం సుమారు 3,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి వివిధ విశ్వవిద్యాలయాల్లో 1,500 అధ్యాపక పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.


అలాగే గ్రూప్–1, గ్రూప్–2 కింద దాదాపు 600 పోస్టులు, 1,000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల నుండి నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశకు స్పష్టమైన గడువులు నిర్ణయించడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు.“జాబ్ క్యాలెండర్ కేవలం ప్రకటన కాదు, నిరుద్యోగులకు భరోసా” అని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు గందరగోళం లేకుండా ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలు, జాబ్ ఫెయిర్లు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించారు.


ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ Reddy పాలనపై విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను నిరాశపరిచారని ఆరోపించారు. పరిశ్రమల పెట్టుబడులు తీసుకురావడంలో వైఫల్యం కారణంగా యువత భవిష్యత్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
అభ్యుదయ దిశగా యువతను ప్రోత్సహించడం, వారికి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.

Leave a Reply