ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ప్రదర్శనతో మరోసారి రికార్డులను తిరగరాశాడు. తన శక్తివంతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను కట్టడి చేసిన బుమ్రా… 27 ఓవర్లలో కేవలం 83 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. చివరిగా జోష్ టంగ్‌ను ఔట్ చేస్తూ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.
ఈ ఐదు వికెట్లు బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 14వ ఐదు వికెట్ల హాల్ కాగా, ఇంగ్లాండ్‌పై ఇది అతని నాల్గవ ఐదు వికెట్ల ప్రదర్శన. ఈ ప్రదర్శనతో బుమ్రా తన ఫామ్‌ను మరోసారి బలంగా రుజువు చేశాడు.
సెనా దేశాల్లో అతిథి బౌలర్లుగా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు:
అంతేకాదు, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అతిథి బౌలర్లలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బుమ్రా మూడో స్థానానికి చేరాడు. బుమ్రా ప్రస్తుతం 60 ఇన్నింగ్స్‌ల్లో 150 వికెట్లతో నిలవగా, కర్ట్నీ వాల్ష్ (213), కర్ట్లీ ఆంబ్రోస్ (184) మాత్రమే బుమ్రాని మించిన బౌలర్లు. బుమ్రా తర్వాత స్థానాల్లో మాల్కమ్ మార్షల్ (148) మరియు వసీమ్ అక్రమ్ (146) ఉన్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు:
ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా (42 వికెట్లు) ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇషాంత్ శర్మ (51) అగ్రస్థానంలో ఉండగా, కపిల్ దేవ్ (43 వికెట్లు), మహ్మద్ షమీ (42 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారత్ తరఫున అవే టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు సాధించిన బౌలర్లు:
విదేశీ మైదానాల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా ప్రస్తుతం కపిల్ దేవ్ (12 సార్లు)తో సమానంగా ఉన్నాడు. అనిల్ కుంబ్లే 10 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
టెస్ట్‌లలో అత్యధిక ఐదు వికెట్లు తీసిన భారత పేసర్లు:
టెస్టుల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత పేసర్ల జాబితాలో బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ 23 ఐదు వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా… 14 సార్లు ఐదు వికెట్లు తీసిన బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ 11 సార్లు ఐదు వికెట్ల ఘనతలతో మూడవ స్థానంలో ఉన్నారు.
ఒకే జట్టుపై జస్‌ప్రీత్ బుమ్రా అత్యధిక టెస్ట్ వికెట్లు:
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టుల్లో బుమ్రా ఇప్పటివరకు 65 వికెట్లు పడగొట్టాడు. ఆ జట్టుపై అతని అత్యధిక వికెట్లు కాగా.. ఆస్ట్రేలియా (64), దక్షిణాఫ్రికా (38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మొత్తంమీద, ఈ టెస్ట్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శన నేటి తరం అగ్రశ్రేణి బౌలర్లలో ఒకరిగా అతన్ని మరింతగా స్థిరపరిచింది.