వెలగపూడి – జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ ఏడాది కాలంలో పార్టీ సాధించిన ప్రగతి, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలను ఈ వీడియోలో పొందుపరిచారు.
ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం, 55 గిరిజన గ్రామాలకు 39 కిలోమీటర్లు రోడ్లు వేయడం, కుంకీ ఏనుగులను తీసుకురావడం, ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ అందించడం వంటివి వీడియోలో చూపించారు. పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ ప్రత్యేక వీడియో, పవన్ ఒక సాధారణ రాజకీయ నేత స్థాయి నుంచి “గేమ్ ఛేంజర్”గా ఎలా ఎదిగారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా సాధించిన తొలి ఎన్నికల విజయం ఆ ప్రాంతంలో పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్ అందించిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఆయన తిరగరాసిన విధానం వంటి అంశాలను వీడియోలో ప్రముఖంగా ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ సహనం, పట్టుదల, వ్యూహాత్మక పొత్తుల ద్వారా జనసేనను రాష్ట్ర రాజకీయాల్లో అగ్రస్థానానికి చేర్చినట్లు వివరించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో వీడియోలోని వ్యాఖ్యాతలు విశ్లేషించారు. ఈ వీడియో ద్వారా పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రజలకు గుర్తు చేయడమే లక్ష్యమని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.